Gujarat Elections 2022:


యూసీసీపై రాజ్‌నాథ్ సింగ్..


గుజరాత్ ఎన్నికలను ప్రభావితం చేయనున్న అంశాల్లో యూసీసీ (Uniform Civil Code) కూడా ఒకటి. ఇప్పటికే అమిత్‌షా ఎన్నో సందర్భాల్లో దీనిపై స్పష్టతనిచ్చారు. కచ్చితంగా అమలు చేసి తీరతామని తేల్చి చెప్పారు. ఇప్పుడు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా దీనిపై స్పందించారు. ABP Newsకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. "దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది" అని అన్నారు. అన్ని రాష్ట్రాలూ ఈ కోడ్‌ను అమలు చేసే ఆలోచన చేయాలని సూచించారు. దీంతో పాటు మరి కొన్ని అంశాలనూ ప్రస్తావించారు. శ్రద్ధ హత్య కేసుపైనా స్పందించారు. "ఇంత దారుణానికి ఒడిగట్టిన నిందితుడికి కఠిన శిక్ష పడాల్సిందే" అని తేల్చి చెప్పారు. 2024 ఎన్నికలపైనా మాట్లాడారు. గుజరాత్‌లోనే కాకుండా...కేంద్రంలోనూ మరోసారి మోడీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. "గుజరాత్ ఎన్నికల్లో మేం విజయం సాధిస్తాం. మా అభివృద్ధి పనులే మమ్మల్ని గెలిపిస్తాయి" అని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశమంతా పర్యటించి...అన్ని ప్రాంతాల్లోనూ పురోగతి సాధించేందుకు శ్రమిస్తున్నారని కొనియాడారు. భారత్ జోడో యాత్రపై స్పందిస్తూ...రాహుల్ గాంధీ ఇప్పుడే తన ప్రయాణం ప్రారంభించారని, తరవాత ఏం జరుగుతుందో వేచి చూడాలని అన్నారు. 


అమిత్‌షా కామెంట్స్..


కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా ఇటీవల యూసీసీ (Uniform Civil Code)పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కోడ్‌ను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. అయితే...అంత కన్నా చర్చలు, వాదనలు తప్పకుండా వింటామని అన్నారు. జనసంఘ్‌గా ఉన్న 
నాటి నుంచే బీజేపీ ఈ హామీ ఇస్తూ వస్తోందని గుర్తు చేశారు. "బీజేపీ మాత్రమే కాదు. ఎప్పుడో మన రాజ్యాంగ పరిషత్ కూడా యూసీసీని సరైన సమయంలో అమలు చేయొచ్చని సూచించింది. సెక్యులర్ దేశంలో మతాల ఆధారంగా చట్టాలు చేయడం సరికాదని చెప్పింది. రాష్ట్రాలన్నీ 
సెక్యులర్‌గా మారిపోతే అప్పుడు మతాల ఆధారంగా చట్టాల అవసరం ఎందుకు.." అని అన్నారు అమిత్‌షా. అప్పట్లో రాజ్యాంగ పరిషత్ చేసిన సూచనలు కాలక్రమంగా మరుగున పడిపోయాయని చెప్పారు. బీజేపీ తప్ప మరే పార్టీ కూడా యూసీసీకి మద్దతునివ్వడం లేదని తెలిపారు. 
ప్రజాస్వామ్యంలో ఏది అమలు చేయాలన్నా కచ్చితంగా దానిపై వాదోపవాదాలు జరగాలని అభిప్రాయపడ్డారు. భాజపా  పాలిత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్‌లో యూసీసీ అమలు కోసం ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. సుప్రీం కోర్టు, హైకోర్టుల మాజీ చీఫ్ జస్టిస్‌లు ఈ ప్యానెల్‌కు నేతృత్వం వహిస్తున్నారు. వీళ్లంతా చర్చించి ఎలాంటి సూచనలు చేస్తారో చూసి..ఆ తరవాతే యూసీసీ అమలు చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. గుజరాత్ ప్రభుత్వం Uniform Civil Codeని అమలు చేస్తుందన్న వార్తలు వినిపిస్తుండగానే...ఆ ప్రభుత్వం అధికారికంగా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో ఈ కోడ్‌ను అమలు చేసేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించినట్టు స్పష్టం చేసింది. 


Also Read: Arvind Kejriwal: 'సార్, మీరు మఫ్లర్ ఎందుకు వేసుకోలేదు'- కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన యువతి