Jagan On Vidya Deevena :  బటన్ నొక్కి ప్రజలకు మంచి చేస్తూంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గత పాలకులు అధికారంలో ఉన్నప్పుడు బటన్ నొక్కి డబ్బులు ఎందుకు ఇవ్వలేదని ఆనయ ప్రశ్నించారు. పేదలు బాగుపడటం తట్టుకోలేక పెత్తందారులు దుష్ప్రచారాలు చేస్తున్నారని  మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అనేది కొలమానంగా తీసుకోవాలని ప్రజల్ని కోరారు.  మంచి జరిగితే  తోడుగా ఉండాలని కోరారు. మదనపల్లెలో  విద్యా దీవెన నిధులను విడుదల చేసిన తర్వాత జగన్ ప్రసంగించారు. 


గతంలో గజదొంగల ముఠా ఉండేదని.. దుష్టచతుష్టయం దోచుకో, పంచుకో, తినుకో అని రాష్ట్రాన్ని దోచేశారని ఆరోపించారు. అందుకే ఆరోజు ప్రజలకు మంచి చేయాలని ఎవరూ ఆలోచన చేయలేదని అన్నారు. తనకు పొత్తు ప్రజలతోనేనని అన్నారు.  వాళ్ల మాదిరిగా టీవీ చానళ్లు, పేపర్లు, దత్తపుత్రుడు తోడుగా లేరన్నారు. చెప్పింది తప్పకుండా చేస్తానని.. మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో 98 శాతం నేరవెర్చామన్నారు.  గతంలో మేనిఫెస్టోలు చెత్తబుట్టలో ఉండేవి.. ఆ పరిస్థితిని మార్చామన్నారు.  రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకోచ్చామని చెప్పారు. పిల్లలను మోసం చేసిన చంద్రబాబు నేడు చదువు గురించి మాట్లాడుతున్నాడని.. అక్కాచెల్లమ్మలకు ద్రోహం చేసిన చంద్రబాబు మహిళా సాధికరత గురించి మాట్లాడుతున్నాడని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను దగా చేసిన చంద్రబాబు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడని.. అవన్నీ చూసి ఇదేం ఖర్మరా బాబూ అని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. 


అక్షరాలు చదవడం, రాయడం మాత్రమే విద్యకు పరమార్థం కాదని.. ప్రతి ఒక్కరు తనకు తానుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగిన శక్తిని ఇవ్వగలగడమే విద్యకు పరమార్థం అని ... ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పారని జగన్ తన ప్రసంగంలో గుర్తు చేశారు. ప్రతిపక్షాలు వారి భూములు ఉన్న ప్రాంతంలోనే రాజధాని కట్టాలని భావిస్తున్నారని... ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ నిరుపేద వర్గాలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇస్తామంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందనే వాదిస్తున్నారని ఆరోపించారు. జగన్ బటన్ నొక్కడం ద్వారా ప్రజలకు మంచి జరిగితే.. వాళ్లకు పుట్టగతులు ఉండవని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. 
  
విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. పేదలకు చదువును హక్కుగా మార్చామని చెప్పారు. చంద్రబాబు హయాంలో పెట్టిన  బకాయిలు రూ. 1,776 కోట్లు చెల్లించామని తెలిపారు. జగనన్న  విద్యాదీవెన కింద రూ. 9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ. 3,349 కోట్లు అందించామని చెప్పారు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్థులకు రూ. 694 కోట్లు జమ చేస్తున్నామని తెలిపారు. నేరుగా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు.  పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు నేరుగా చూసి అధికారంలోకి రాగానే జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తున్నామని తెలిపారు. విద్యాదీవెనకు తోడుగా  జగనన్న వసతి దీవెన కూడా ఇస్తున్నామని చెప్పారు. పోటీ ప్రపంచంలో పిల్లలు నెగ్గుకు వచ్చేలా సీబీఎస్‌ఈ, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని చెప్పారు. గోరుముద్ద, విద్యా కానుక, నాడు నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్పు వచ్చిందన్నారు.