ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకొని... గూండాలకు కొమ్ముకాస్తారా అంటు పోలీసులపై ఫైర్ అయ్యారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల. రాత్రి బెయిల్ పై విడుదలైన ఆమె... ట్విటర్ వేదికగా ప్రభుత్వంపై, పోలీసుల తీరుపై మండిపడ్డారు. తనకు మద్దతు తెలిపిన వారందరికీ ఆమె కృతజ్ఞత తెలిపారు.
పాలకపక్ష ఆగడాలు పతాక స్థాయికి చేరినపుడు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి దాడులకు పాల్పడినపుడు పార్టీలకు అతీతంగా నిలదీయడం అందరి కర్తవ్యమన్నారు షర్మిల. తన పోరాటానికి మద్దతు తెలిపి, ప్రభుత్వ దాడిని ఖండించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఒకప్పుడు టీఆర్‌ఎస్ ఉద్యమకారుల పార్టీగా ఉండేదని... ఇప్పుడు మాత్రం గూండాల పార్టీ, బంధిపోట్ల పార్టీగా మారిందని విరుచుకుపడ్డారు షర్మిల. ఒక మహిళ 3500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి, KCR మోసాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శరించారు. అందుకే తమపై పెట్రోల్ దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రజల పక్షాన నిలబడడం తప్పా? అంటూ నిలదీశారు. ఇది తెలంగాణ కాదు ఆఫ్ఘనిస్తాన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఒక తాలిబన్ అని సంచలన కామెంట్స్ చేశారు షర్మిల. నర్సంపేటలో, హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించింది టీఆర్ఎస్ గూండాలు, పోలీసులేనన్నారు. టీఆర్ఎస్ గూండాలను వదిలిపెట్టి, తమను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. కేసీఆర్‌కు తొత్తుల్లా పోలీసులు మారారని... నిబంధనలకు విరుద్ధంగా తమ పార్టీ కార్యకర్తలను తీవ్రంగా కొట్టారన్నారు.
దాడులు చేసే హక్కు పోలీసులకు ఎక్కడిదని నిలదీశారు షర్మిల. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుని, గూండాలకు కొమ్ముకాస్తారా అని ప్రశ్నించారు. ఒక మహిళపై దాడి చేయించడానికి కేసీఆర్ కు సిగ్గుండాలన్నారు. ఇది దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యమని విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆగదని స్పష్టం చేశారు.
కేసీఆర్ పిరికిపంద చర్యలకు బెదిరేది కాదు వైయస్ఆర్ బిడ్డ అని బెయిల్ పై విడుదలైన సందర్భంగా రాత్రి మాట్లాడుర. ప్రజాస్వామ్యాన్ని పాతరేసి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని, పోలీసులను పనోళ్లలా వాడుకొని, టీఆర్ఎస్ గూండాలను ఉసిగొల్పి దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. ఖబడ్దార్ కేసిఆర్ అంటూ హెచ్చరించారు. ప్రగతిభవన్ లో దాక్కున్నా.. ఫామ్ హౌజ్ లో దాక్కున్నా కేసిఆర్ పతనం ఖాయమంటూ మాస్ డైలాగ్స్‌తో రెచ్చిపోయారు.