దేశానికి ప్రధాని ఒక్కరే ఉంటారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక్కరే ఉంటారు. ఇంత వరకూ మనకు స్పష్టంగా తెలుసు. డిప్యూటీ సీఎంలను ఐదుగుర్నైనా పెట్టుకోవచ్చని రెండున్నరేళ్ల కిందట ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారు. కానీ ఇప్పుడు మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్ .. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. ఒకే సారి ఒకే రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రుల్ని పెడతారట. ఈ విషయాన్ని ఆయన యూపీలో ప్రకటించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు.. ఒకరు ఓబీసీ నుంచి.. మరొకరు దళిత వర్గం నుంచి ఉంటారట. అలాగే ముగ్గురు డిప్యూటీ సీఎంలు కూడా ఉంటారట. అందులో ఒకరు ముస్లిం వర్గం నుంచి ఉంటారని ఆయన చెబుతున్నారు. 


Also Read: Pramod Gupta Joins BJP: యూపీలో భాజపా దెబ్బకు దెబ్బ.. నిన్న కోడలు, నేడు తోడల్లుడు.. ఎస్పీకి వరుస షాక్‌లు!


అసదుద్దీన్ ప్రకటన ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. ఇద్దరు సీఎంలు రాజ్యాంగ పరంగా ఎలా సాధ్యమో ఆయన వివరించాల్సి ఉంది. కానీ అలాంటి ప్రకటనలు గెలిచిన తర్వాత చెబుతారేమో కానీ ఇప్పుడైతే ఆ అంశం జోలికి వెళ్లలేదు. రెండున్నరేళ్ల ఫార్ములా ఏమైనా వర్కవుట్ చేస్తారా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. యూపీలో చిన్నా చితకా పార్టీలతో కలిసి వంద స్థానాల్లో పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఓవైసీ. ఆ దిశగా ముందడుగు వేస్తున్నారు. బాబూ సింగ్ కుష్వాహా, భారత్ ముక్తి మోర్చా పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నట్లుగా ప్రకటించారు.  


గతంలో ఓం ప్రకాష్ రాజ్‌భర్‌కు చెందిన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు ఒవైసీ ప్రకటించారు. రాజ్‌భర్ ఆ కూటమిని విడిచిపెట్టి.. సమాజ్‌వాదీ పార్టీలో కలిశారు.రాజ్‌భర్‌ పార్టీ తమ కూటమి నుంచి విడిపోయిందని, అయినప్పటికీ 100 సీట్లలో తమ కొత్త కూటమి పోటీ చేస్తుందని వెల్లడించారు. అన్ని స్థానాల్లో గట్టిపోటీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అసదుద్దీన్‌ ఒవైసీ ఇటీవల మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో ఏ రాజకీయపార్టీ ముస్లింల అభివృద్ధికి కృషి చేయలేదని విమర్శించారు. ముస్లింకు ఉత్తరప్రదేశ్‌లో అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు.


Also Read: UP Cong Candidate List: యూపీలో కాంగ్రెస్ 'మహిళా' అస్త్రం.. రెండో జాబితాలో 16 మందికి చోటు




ముస్లింను ఓట్లను చీల్చి బీజేపీకి మేలు చేయడానికి అసదుద్దీన్ ప్రయత్నిస్తున్నారని యూపీలోని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. అన్ని చిన్న పార్టీలను కలుపుకుని పోతున్న సమాజ్ వాదీ పార్టీతో కలవొచ్చు కదా అని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. యూపీ ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఎస్పీకే ఉంది. ఆ పార్టీ బీజేపీకి గట్టి పోటీ ఇస్తోంది. ఈ క్రమంలో ఓవైసీ పోటీ విమర్శలకు కారణం అవుతోంది. 






ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి