UP News: ఆపదలో ఉన్నాం.. కాపాడండంటూ ఎవరైనా ట్వీట్ చేసినా, ఫోన్ చేసిన వెంటనే రంగంలో దిగిపోతుంటారు పోలీసులు. ముఖ్యంగా ఆకతాయిలు ఏడిపిస్తున్నారు, హత్య చేయాలని చూస్తున్నారు, దోచుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఆఘమేఘాల మీద వాలిపోతుంటారు. ఇలాంటి వార్తలు మనం చాలానే విన్నాం. కానీ ఇప్పుడు చూడబోయే వార్త  మాత్రం అందర్నీ ఆశ్చర్యంలో ముంచేస్తుంది. "దోమలు కుట్టి నా భార్య, కూతురు చాలా ఇబ్బంది పడుతున్నారు, మస్కిటో కిల్లర్ కావాలని" ఓ వ్యక్తి చేసిన ట్వీట్ కు పోలీసులు స్పందించారు. వెంటనే మస్కిటో కాయిల్స్ తో అతనున్న చోటుకు వెళ్లారు. అతడి సమస్యను తీర్చారు. 






అసలేం జరిగిందంటే..?


ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ జిల్లాకు చెందిన అసద్ ఖాన్ అనే వ్యక్తి భార్య ఆదివారం రాత్రి చందౌసిలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రిలో విపరీతంగా ఉన్న దోమలు అసద్  భార్యను, నవాత శిశువును తీవ్రంగా కుట్టడంతో చిన్నారి ఏడవడం ప్రారంభించింది. వారి బాధను చూడలేని అసద్ ఖాన్ మస్కిట్ కిల్లర్ కోసం బయటకు వెళ్లాడు. అర్థరాత్రి కావడంతో దుకాణాలన్నీ మూసి ఉన్నాయి. ఇక చేసేదేం లేక వెనక్కి వచ్చాడు. భార్య, కూతురు ఇబ్బందిని చూసి చలించిపోయాడు. సమస్య తీర్చేందుకు ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచంచి.. చివరకు అద్భుతమైన ప్లాన్ వేశాడు. యూపీ పోలీసులకు ట్వీట్ చేశాడు. డయల్ 112 ట్విట్టర్ ఖాతాలు ట్యాగ్ చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు... ఆసుపత్రికి వచ్చి మరీ అసద్ ఖాన్ కు మస్కిటో కిల్లర్ ను అందించారు. ఈ క్రమంలోనే "మాఫియా నుంచి మస్కిటో వరకు దేన్నైనా ఎదుర్కుంటాం" అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున ప్రశంసిస్తున్నారు. సమస్య అని తెలియగానే స్పందించినందుకు థాంక్యూ అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.