UP Bride Chases Groom:
యూపీలో ఘటన..
పెళ్లి చేసుకోవాలా వద్దా అన్న డైలమాలో ఉన్నాడా యువకుడు. చాలా రోజులు ఆలోచించి చివరకు సరే అన్నాడు. సీన్ కట్ చేస్తే ముహూర్తం పెట్టేశారు. వేదిక కూడా రెడీ అయిపోయింది. వధువు మెడలో తాళి కట్టడమొకటే మిగిలింది. చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక తాళి కడతాడు అనుకున్న టైమ్‌లో ఉన్నట్టుండి మ్యారేజ్ హాల్ నుంచి పారిపోయాడు వరుడు. పెళ్లికొచ్చిన వాళ్లంతా ఇది చూసి షాక్ అయ్యారు. "ఇదేం వింత" అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ వధువు మాత్రం అలా నిలబడిపోలేదు. ఇక్కడి వరకూ వచ్చాక తాళి కట్టకుండా వెళ్తావా అని ఆ వరుడి వెంట పడింది. చాలా దూరం వరకూ తరిమింది. నిలదీసి మరీ తాళి కట్టించుకుంది. యూపీలోని బరేలీలో జరిగిందీ వింత ఘటన. తనకు పెళ్లి ఇష్టం లేదని చివరి క్షణంలో చెప్పడం వల్ల వచ్చిన తంటా ఇది. కానీ...ఆ వధువు మాత్రం పెళ్లి చేసుకోవాల్సిందేనని పట్టుపట్టింది. పంతం నెగ్గించుకుంది. దాదాపు రెండున్నరేళ్లుగా ఈ జంట రిలేషన్‌షిప్‌లో ఉంది.
పెళ్లి డ్రెస్‌లోనే ఛేజింగ్..
ముహూర్త సమయానికి వరుడు కనిపించకపోయే సరికి ఆ అమ్మాయికి డౌట్ వచ్చింది. వెంటనే కాల్ చేసింది. "అమ్మను తీసుకురావడానికి వచ్చాను" అని అబద్ధం చెప్పాడు వరుడు. ఇది నమ్మని ఆ యువతి వెంటనే వరుడి కోసం వెతకడం మొదలు పెట్టింది. పెళ్లి డ్రెస్‌లోనే బయటకు వచ్చి గాలించింది. దాదాపు 20 కిలోమీటర్ల వరకూ వెంటపడి మరీ వరుడిని పట్టుకుంది. ఓ పోలీస్ స్టేషన్ సమీపంలోని బస్సులో కనిపించాడు వరుడు. చాలా సేపు డ్రామా తరవాత దగ్గర్లోని ఆలయానికి తీసుకెళ్లి తాళి కట్టించుకుంది వధువు. ఇరు వర్గాలూ కాసేపయ్యాక శాంతించి...జంటను ఆశీర్వదించాయి. అయితే...ఈ ఎపిసోడ్ మొత్తంలో అందరూ వధువుని పొగిడేశారు. "నీ ధైర్యానికి సెల్యూట్" అని కితాబునిచ్చారు.
ఇండోర్‌లో ఇలా..
కాసేపట్లో పెళ్లి చేసుకోవాల్సిన జంట మండపంలో ఉండగానే విషం తాగారు. వరుడు చనిపోగా...వధువు పరిస్థితి విషమంగా ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిందీ ఘటన. పెళ్లి విషయంలో తలెత్తిన వివాదం కాస్తా ఆత్మహత్య వరకూ దారి తీసింది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే 21 ఏళ్ల వరుడు కన్నుమూశాడు. ఈ జంట ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకోడానికి వెళ్లింది. అక్కడి వెళ్లగానే వరుడు "నేను విషం తాగాను" అని చావు కబురు చల్లగా చెప్పాడు. ఇది తెలిసి వధువు కూడా విషం తాగింది. అసలు ఎందుకు విషం తాగారు..? ఏ విషయంలో గొడవ జరిగింది..? అన్న ప్రశ్నలకు పోలీసులు సమాధానమిచ్చారు. కొద్ది రోజులుగా తనను పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయి, అబ్బాయిని ఇబ్బంది పెడుతోంది. పదేపదే ఒత్తిడి చేస్తోంది. అయితే...వరుడు మాత్రం అందుకు అంగీరించలేదు. కెరీర్‌పై ఫోకస్ చేయలేనని తేల్చి చెప్పాడు. రెండేళ్ల టైమ్ అడిగాడు. కానీ...ఆ అమ్మాయి అందుకు ఒప్పుకోలేదు. అంతే కాదు. పోలీసులకు కంప్లెయింట్ చేసింది. తనను మోసం చేశాడని చెప్పింది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. మరి కొద్ది సేపట్లో పెళ్లి చేసుకుంటారనగా..విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు వరుడు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Also Read: PM Modi: మన సంస్కృతి గురించి ధైర్యంగా చెప్పండి, వినేందుకు ప్రపంచం సిద్ధంగా ఉంది - ప్రధాని మోదీ