PM Modi 3 Nation Trip:


పర్యటన ముగింపు..


ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. జపాన్‌, పపువా న్యూ గినియా, ఆస్ట్రేలియా పర్యటించిన మోదీ...ఆయా దేశాల అధినేతలతో కీలక చర్చలు జరిపారు. వెళ్లిన ప్రతి చోట ఆయనకు ఘన స్వాగతం పలికారు అక్కడి ప్రజలు. భారత్‌లో ఆయా దేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఈ చర్చలు ఉపయోగపడతాయని మోదీ సర్కార్ స్పష్టం చేస్తోంది. అయితే...ఈ  పర్యటన ముగించుకుని ఢిల్లీకి వచ్చిన ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఆలోచనలు, అభిప్రాయాలు ఏంటో తెలుసుకోడానికి ప్రపంచమంతా ఆసక్తి చూపుతోందని వెల్లడించారు. విదేశాలకు భారీ మొత్తంలో వ్యాక్సిన్‌లు పంపడంపై విపక్షాలు అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. దేశ ప్రజల్ని కాదని వేరే దేశాలకు పంపుతారా అని ప్రశ్నించాయి. దీనిపై ఎప్పుడూ స్పందించని మోదీ...ఈ సారి గట్టిగానే మాట్లాడారు. విమర్శలు చేసే వారికి దీటైన బదులిచ్చారు. 


"ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌లు ఎందుకు పంపించారని భారత్‌లోని కొందరు నేతలు నన్ను ప్రశ్నించారు. వాళ్లందరికీ నేను చెప్పేది ఒకటే. ఇది బుద్ధుడు, మహాత్మా గాంధీజీ తిరిగిన నేల. శత్రువుల బాగోగులు కూడా చూడాలన్నదే భారత దేశ ధర్మం. అందుకే...ఇప్పుడు ప్రపంచమంతా భారత్‌ ఆలోచనలు, అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవాలని చాలా ఆసక్తి కనబరుస్తోంది"


- ప్రధాని నరేంద్ర మోదీ 






మూడు దేశాల పర్యటన ముగిసిన తరవాత ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు మోదీ. అక్కడే వెల్‌కమ్ ఈవెంట్ జరిగింది. ఆ కార్యక్రమంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. సిడ్నీలో తనకు లభించిన ఘన స్వాగతం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీలు, ప్రతిపక్ష ఎంపీలతో పాటు ప్రధాని ఆంటోని ఆల్బనీస్‌ కలిసొచ్చి తనకు స్వాగతం పలికినట్టు చెప్పారు. అది ప్రజాస్వామ్యంలోనే ఉన్న గొప్పదనం అని కొనియాడారు. 


"నా దేశ సంస్కృతి గురించి మాట్లాడినప్పుడు..నేను ప్రపంచం ఎలా ఉందో గమనిస్తాను. ఎక్కడికెళ్లినా చాలా ధైర్యంగా మాట్లాడతాను. ఇంత ధైర్యం మీరిచ్చిన మెజార్టీతోనే వచ్చింది. ఈ ఈవెంట్‌కి వచ్చిన వాళ్లెవరైనా సరే...మోదీని చూసి కాదు. దేశంపైన ప్రేమ ఉండి వచ్చారు. ఎక్కడైనా సరే ధైర్యంగా మాట్లాడండి. ప్రపంచం వినడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆలయాలపై దాడులను నేను ఖండించినప్పుడు ఆస్ట్రేలియా చాలా సావధానంగా నేను చెప్పినదంతా వినడమే కాదు, సమస్య పరిష్కారానికీ అంగీకరించింది"


- ప్రధాని నరేంద్ర మోదీ