United States of Kailasa:
శాశ్వత ప్రతినిధిగా..
స్వామి నిత్యానంద ఓ దీవి కొనుగోలు చేసి దానికి "United States of Kailasa" అనే పేరు పెట్టుకోవడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. రెండేళ్ల క్రితమే ఈ పేరు పెట్టారు ఆయన. ఇప్పుడా దీవికి నిత్యానంద దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేసింది. ఇటీవల జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలోనూ ఈ దేశానికి చెందిన ప్రతినిధి హాజరయ్యారు. ఇప్పుడీ వార్తే తెగ వైరల్ అవుతోంది. స్వామి నిత్యానంద ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫిబ్రవరి 22న జరిగిన ఈ సమావేశంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస నుంచి ప్రతినిధిగా విజయప్రియ నిత్యానంద హాజరయ్యారు. Economic, Social and Cultural Rights (CESR) మీటింగ్‌లో ఆమె పాల్గొన్నారు.
ఐక్యరాజ్య సమితి అప్‌లోడ్ చేసిన వీడియో ఆధారంగా చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆప్ కైలాసాకు విజయప్రియ శాశ్వత ప్రతినిధి హోదా ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. అయితే..ఈ దేశాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించిందా లేదా అన్న విషయంలో స్పష్టత లేదు. అయితే...ఈ సమావేశంలో కీలక విషయాలు ప్రస్తావించారు విజయప్రియ. Sustainable Development Goals (SDG)కి, హిందూయిజానికి లింక్ ఉందని అన్నారు. తమ దేశాన్ని స్థాపించిన నిత్యానందను భారత్ గుర్తించడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
"హిందూయిజం కోసం తొలిసారి నిత్యానంద స్వామి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసాను స్థాపించారు. హిందూ నాగరికత, సంస్కృతిని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఈ మతంలో ఉన్న 10 వేల భిన్న సంస్కృతులను పరిచయం చేస్తున్నారు. సనాతనంగా వస్తున్న హిందూ విధానాలను అనుసరిస్తున్నారు. సుస్థిరాభివృద్ధికి ఇవి ఎంతో ఉపకరిస్తున్నాయి. ఇంత చేసినా ఆయనకు ఇబ్బందులు తప్పలేదు. మానవ హక్కుల ఉల్లంఘనతో పాటు మరి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. సొంత దేశమే ఆయనను తరిమేసింది. కైలాసాలోని 20 లక్షల మంది హిందువులకు మేలు జరగాలంటే, నిత్యానందపై వేధింపులు ఆగాలంటే ఏ చర్యలు తీసుకోవాలి సూచించండి"
- విజయప్రియ నిత్యానంద, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస
లైంగిక ఆరోపణలు..
తమ దేశం చాలా చోట్ల ఎంబసీలను ఏర్పాటు చేసిందని, 150 దేశాల్లో ఎన్‌జీవోలనూ స్థాపించిందని వివరించారు విజయప్రియ. నిత్యానంద స్వామి మన దేశంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు ఆయన కోర్టు కేసుల్లో హాజరయ్యారు. 2019 నవంబర్‌లో ఆయన భారత్ వదిలి వెళ్లిపోయారు. కొన్నాళ్లకు ఆయన ఈక్వెడార్ సమీపంలో ఓ దీవిలో ఉన్నట్టు తెలిసింది. ఆ దీవిని స్వయంగా ఆయన కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. దానికి ఆయన కైలాస దీవి అనే పేరు పెట్టారు. ఆ కైలాస దీవికి ఆయనే ప్రధానమంత్రి అని ప్రకటించుకున్నారు. అంతేకాదు, ఆ దీవికి ప్రత్యేకంగా కరెన్సీ కూడా ప్రారంభించారు. అంతేకాదు, ఆ కైలాస దీవిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐరాసలోనూ విజ్ఞప్తి చేశాడు. అయితే ఈక్వెడార్ మాత్రం ఈ వార్తలను ఖండించింది. అయితే కొన్ని నెలల క్రితం నిత్యానంద స్వామి చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలతో ఖంగుతిన్న నిత్యానంద స్వామి ...తన మరణంపై సాగుతున్న ప్రచారాన్ని కొట్టి పారేశారు.