Work From Office:
స్పెషల్ సర్వే
వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఇక ముగిసినట్టేనా..? ఇప్పుడిదే అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొవిడ్ తగ్గిపోయి సాధారణ పరిస్థితులు వచ్చినప్పటికీ చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే మొగ్గు చూపుతున్నారు. కంపెనీలు కూడా ఎటూ తేల్చుకోలేక పోతున్నాయి. ఈ ఆప్షన్ ఉంచాలా తీసేయాలా అన్న సందిగ్ధంలో పడ్డాయి. అప్పటికీ కొన్ని సంస్థలు ఈ ఆప్షన్‌ను తొలగించాయి. మరి కొన్ని హైబ్రిడ్ మోడల్‌ను అనుసరిస్తున్నాయి. దీనిపై ఓ ఆసక్తికర సర్వే వెలుగులోకి వచ్చింది. Gallup Research Study ప్రకారం...పాండెమిక్ తరవాత కేవలం 9% మంది మాత్రమే ఆఫీస్‌కు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. 32% మంది వర్క్ ఫ్రమ్ హోమ్‌కే ఓటు వేస్తున్నారు. 59% మంది హైబ్రిడ్ మోడల్‌కు ఓకే చెప్పారు. అయితే..హైబ్రిడ్ వర్క్ మోడల్‌లో ఎన్ని రోజులు ఆఫీస్‌కు రావాలన్న క్లారిటీ కొన్ని కంపెనీలు ఇవ్వడం లేదు. ఉద్యోగులే తమ వీలు ప్రకారం ఆఫీస్‌లకు వెళ్తున్నారు. అయితే...మేనేజర్‌లకు ఇప్పుడు కొత్త తలనొప్పి పట్టుకుంది. చాలా మంది ఎంప్లాయిస్ ఆఫీస్‌కు వచ్చి పని చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ప్రొడక్టివిటీ తగ్గిపోతుందని ఎంతగా చెబుతున్నా పట్టించుకోవడం లేదు. పైగా ఒత్తిడి చేస్తే కంపెనీ మారిపోతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ప్రొడక్టివిటీ తగ్గుతుందన్న వాదనను కొట్టి పారేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అధ్యయనం ప్రకారం..11 దేశాల్లోని 20 వేల మందిని విచారించగా...87% మంది WFHతో ప్రొడక్టివిటీ పెరిగిందని తేల్చి చెప్పారు. 12% మంది టీమ్ లీడర్స్ కూడా దీన్ని అంగీకరిస్తున్నారు.
వ్యక్తిగతమే..
అయితే అన్ని సందర్భాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ మేలు చేస్తుందని అనుకోలేమన్నది Gallup Research Study వెల్లడించిన విషయం. ఉద్యోగులంతా కలిసి పని చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఆఫీస్‌లకు రావాలనే అంటున్నారు కొందరు నిపుణులు. అంతే కాదు. ఎవరి ఇళ్లలో వాళ్లు పని చేసుకోవడం వల్ల కొత్త టార్గెట్‌లు పెట్టుకోడానికి వీలుండదని, అది వాళ్ల కెరీర్‌కు కూడా ఇబ్బంది కలిగిస్తుందని వివరిస్తున్నారు. ఇక్కడే మరో సమస్య కూడా ఉంది. సిటీల్లో ట్రాఫిక్‌ను దాటుకుని ఆఫీస్‌లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు చాలా మంది ఉద్యోగులు అసహనానికి గురవుతున్నారు. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌నే ప్రిఫర్ చేస్తున్నారు. అందుకే ఫ్లెక్సిబుల్‌గా ఏ షిఫ్ట్‌లోనైనా పని చేసుకునే వీలు కల్పిస్తే బాగుటుందని సూచిస్తున్నారు టెక్ నిపుణులు. ఏదేమైనా ఒంటరిగా పని చేసుకోవాలా..? లేదంటే ఆఫీస్‌కు వెళ్లి అందరితో పాటు కలిసి పని చేయాలా అన్న నిర్ణయం వ్యక్తిగతం అని చెబుతున్నారు.
ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సులో ఇన్‌ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. ఐటీలో ఈ రెండు మూడేళ్లలో వచ్చిన మార్పులనూ ప్రస్తావించారు నారాయణ మూర్తి. ఆర్గనైజేషన్ కల్చర్ అనేది బలపడాలంటే ఉద్యోగులందరూ కలిసి మెలిసి పని చేయాలని సూచించారు. అందుకే తాను వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌పై పెద్దగా ఆసక్తి చూపించలేదని స్పష్టం చేశారు. మూన్‌లైటింగ్ అనైతికమని ఒకేసారి రెండు కంపెనీల్లో పని చేయడం సరికాదని తేల్చి చెప్పారు.