MLA Rajsingh News: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రభుత్వం మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు తరచూ మొరాయిస్తుందని.. పలుమార్లు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, రాష్ట్ర డీజీపీకి, హోమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పాత వాహనాన్ని ఇటీవలే ప్రగతి భవన్ కు తీసుకెళ్లి అక్కడే వదిలి పెట్టారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు సోమవారం మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అందించారు. 2017 మోడల్ వెహికల్‌ను రాజసింగ్‌కు కేటాయించారు.
వాహనం కేటాయింపుపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ప్రస్తుతం తాను శ్రీశైలం నుంచి హైదరాబాద్ బయలుదేరానని తెలిపారు. తెలుపు రంగు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ధూల్ పేటలోని తమ ఇంటికి పోలీసలు తీసుకు వచ్చి పెట్టి వెళ్లారని చెప్పారు. అయితే ఇంటికి వెళ్లాక ఆ వాహనం కండీషన్ ఎలా ఉందో చూసి చెబుతానన్నారు. అయినా తనకు కొత్త కారు కావాలనే ఏం లేదని, మంచి కండీషన్ లో ఉన్న వాహనం అయితే చాలని ఎమ్మెల్యే రాజాసింగ్ వివరించారు.
కారును వదిలి బైకుపై రాజాసింగ్..
అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు తనకు ప్రభుత్వం కేటాయించిన వెహికల్‌ను వదిలేసి బైక్‌పై అసెంబ్లీకి వచ్చారు. అప్పటికే బులెట్ ప్రూఫ్ వాహనంపై వివాదం నడుస్తోంది. దాన్ని వదిలి.. ఈనెల 11వ తేదీన జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆయన టూవీలర్‌పై రావడం ఆశ్చర్య కలిగించింది. ఫిబ్రవరి 10వ తేదీరోజు ప్రగతి భవన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే రాజా సింగ్... అక్కడే తన బులెట్ ప్రూఫ్ వాహనాన్ని వదిలేసి వచ్చారు. తరచూ ఆ వెహికల్ మొరాయిస్తుందని ఆరోపిస్తూ తనకు అలాంటి వెహికల్ వద్దని వదిలేసి వచ్చారు. దీంతో ఇవాళ టూవీలర్‌పై వచ్చారు. ప్రగతి భవన్ వద్ద వదిలి పెట్టిన కారును పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఫిబ్రవరి 8వ తేదీ రోజు ప్రభుత్వం ఆయనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైర్ రోడ్డు మధ్యలో ఊడిపోయింది. అయితే వాహనం కండీషన్ సరిగ్గా లేదని, నెమ్మదిగా వెళ్లడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్తుండగా దూల్ పేట్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఘటన జరిగింది. ఒకవేళ వాహనం రెగ్యులర్ తరహాలో వేగంగా వెళ్లి ఉంటే పెను ప్రమాదం జరిగేదని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చాలని గత కొంతకాలంగా ప్రభుత్వానికి రాజా సింగ్ రిక్వెస్ట్ చేశారు. తన భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేసిందని రాజసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వాహనాన్ని ఇకనైనా వెనక్కి తీసుకోవాలని రాజాసింగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
పలుమార్లు రోడ్డు మధ్యలోనే ఆగిపోయిన రాజా సింగ్ వాహనం
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మరోసారి మధ్యలోనే ఆగిపోయింది. ఈ వాహనం 6 సార్లు నడిరోడ్డుపై నిచిలిపోగా.. అసెంబ్లీ సమావేశాల టైంలో కూడా రోడ్డు మధ్యలో ఏకంగా టైర్ ఊడిపోయింది. ప్రభుత్వం తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తరచుగా రోడ్డుపై ఆగిపోతోందని ఎమ్మెల్యే రాజా సింగ్ చెబుతూ వచ్చారు. అవసరం లేని వారికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తెలంగాణ ప్రభుత్వం సమకూరుస్తుందని.. అవసరం ఉన్న తనకు మాత్రం సరైన వాహనాన్ని అందించడం లేదని గత నెలలోనూ ఆవేదన వ్యక్తం చేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం సరిగా లేకపోవడంతో వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ అధికారులకు చెప్పానని వివరించారు. అయినా కూడా పోలీసులు వినడం లేదని.. ఇలాంటి వాహనాన్ని ఎందుకు ఇస్తున్నారో కూడా అర్థం కావడం లేదన్నారు.