Quiet Hiring:


కొత్త ట్రెండ్..


కార్పొరేట్ రంగంలో ట్రెండ్ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది. కరోనా తరవాత ఈ మార్పుల వేగం పెరిగింది. గ్రేట్ రిజిగ్నేషన్‌తో మొదలై...క్వైట్ క్విట్టింగ్, మూన్‌ లైటింగ్ వరకూ వచ్చింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుండగానే ఇప్పుడు మరో ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి టెక్ కంపెనీలు. దాని పేరే క్వైట్ హైరింగ్ (Quiet Hiring). అంటే సైలెంట్‌గా రిక్రూట్ చేసుకోవడం అన్నమాట. ప్రస్తుతానికి ఇండస్ట్రీలో ఈ ట్రెండ్‌కి మంచి డిమాండ్ ఉంది. కాస్ట్‌ కటింగ్‌లో భాగంగా భారీ సంఖ్యలో లేఆఫ్‌లు కొనసాగిస్తున్న సంస్థలకు..మ్యాన్‌ పవర్‌ను భర్తీ చేసుకునేందుకు ఈ క్వైట్ హైరింగ్ ట్రెండ్ పెద్ద సాయమే చేస్తోంది. ఫుల్ టైమ్‌ ఎంప్లాయ్‌లను నియమించుకోకుండానే...పని పూర్తి చేసేందుకు ఇది తోడ్పడుతోంది. టెక్నికల్ కన్సల్టింగ్ అండ్ రీసెర్చ్ కంపెనీ Gartner ఈ విషయం స్పష్టం చేసింది. ఈ కంపెనీ ప్రకారం...అత్యవసర సమయాల్లో ఈ క్వైట్ హైరింగ్ ప్రక్రియ టెక్ సంస్థలకు భారీ ఊరట కలిగిస్తోంది. ఉన్న మ్యాన్‌ పవర్‌తోనే అన్ని పనులూ సకాలంలో చక్కదిద్దుకునేలా సహకరిస్తోంది. 


అసలేంటీ క్వైట్ హైరింగ్..? (What is Quiet Hiring)


క్వైట్ హైరింగ్ అంటే ఉన్న ఉద్యోగులతోనే అవసరమైన పనులు చేయించుకోవడం. ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే...ఉదాహరణకు ఓ కంపెనీ ఈ ఏడాదిలో కొన్ని టార్గెట్‌లు పెట్టుకుంది అనుకుందాం. అయితే..ఆ టార్గెట్‌ను రీచ్ కావాలంటే అదనంగా ఐదుగురు ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీళ్లను రిక్రూట్ చేసుకుని ట్రైనింగ్ ఇచ్చి ఆ పని పూర్తి చేసే సరికి సమయం అంతా వృథా అవుతుంది. అలా కాకుండా వేరే డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఉద్యోగులను ఇప్పుడు రీసోర్సెస్ అవసరమున్న డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేస్తే ఆ పని సులువుగా పూర్తి చేసుకోవచ్చు. 5గురు డేటా సైంటిస్ట్‌లు అవసరం అనుకుంటే...డేటా అనలిస్ట్‌ల విభాగంలో నుంచి ఐదుగురు ఉద్యోగులను డేటా సైంటిస్ట్ డిపార్ట్‌మెంట్‌లోకి పంపుతారు. పని పూర్తి చేస్తారు. ఇదంతా చాలా సైలెంట్‌గా జరిగిపోతుంది. అందుకే దీన్ని  Quiet Hiring అంటారు. 


ఉద్యోగులకు ఇబ్బంది కాదా..? 


ఇది వినటానికి బాగానే ఉంది కానీ డిపార్ట్‌మెంట్‌లు మారిపోతే వాళ్లు మాత్రం ఎలా పని చేయగలరు అనే సందేహం రావచ్చు. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఉద్యోగం ఉంటే చాలని అనుకుంటున్నారు చాలా మంది. అందుకే సవాళ్లు స్వీకరించేందుకు ముందుకొస్తున్నారు. స్కిల్స్‌ అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారు. కొత్త టెక్నాలజీలు తెలుసుకుంటున్నారు. ఇవన్నీ వాళ్ల కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చేవే. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు కొద్ది రోజులు కష్టపడితే తప్పేముంది..? అనుకుంటున్నారు చాలా మంది ఉద్యోగులు. మారు మాట్లాడకుండా పని చేసేస్తున్నారు. అలా అని కంపెనీలు ఒత్తిడి పెంచితే అసలుకే మోసం వస్తుంది. అందుకే కంపెనీలు ఇలాంటి సవాళ్లు స్వీకరించి పని చేసే వాళ్లకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. వన్ టైమ్ బోనస్,అదనపు వీకాఫ్‌లు, పని గంటల్లో ఫ్లెక్సిబిలిటీ లాంటివి ఇస్తే వాళ్లు ఉత్సాహంగా పని చేస్తారని చెబుతున్నారు. నిజానికి 2022లోనే గూగుల్‌ ఈ క్వైట్ హైరింగ్ ట్రెండ్‌ను ఫాలో అయింది. 


Also Read: Zelensky On Putin: పుతిన్‌కు రోజులు దగ్గర పడ్డాయి, దగ్గరి వాళ్లే ఆయన్ని చంపేస్తారు - జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు