Warren Buffett:


స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి అపూర్వ సంపదను సృష్టించిన వ్యక్తి వారెన్‌ బఫెట్‌! కొత్తగా షేర్లలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలనుకొనే ఔత్సాహికులు మొదట తెలుసుకొనేది ఆయన గురించే!


ఏటా  బెర్క్‌షైర్‌ హాత్‌వే ఇన్వెస్టర్లకు వారెన్‌ బఫెట్‌ (Warren Buffett) లేఖ రాస్తుంటారు. కొంగొత్త సంగతులు చెబుతుంటారు. కొన్ని కంపెనీల షేర్లను కొనుగోలు చేసేటప్పుడు తన ఆలోచనా దృక్పథం ఎలా ఉండేదో వివరిస్తుంటారు. ఈ సారీ అలాగే చేశారు. అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ (American Express), కోకాకోలా (Coca Cola)లో పెట్టిన 2.6 బిలియన్‌ డాలర్లు 20 ఏళ్లలో 47 బిలియన్ డాలర్లుగా ఎలా పెరిగాయో పేర్కొన్నారు.


'1994, ఆగస్టులో కోకాకోలాలో ఏడేళ్లుగా చేస్తున్న షేర్ల కొనుగోలు ముగిసింది. అప్పటికి 400 మిలియన్‌ షేర్లను సొంతం చేసుకున్నాం. వీటి విలువ 1.3 బిలియన్‌ డాలర్లు. బెర్క్‌షైర్‌ విలువలో పెద్ద మొత్తమే పెట్టాం. వీటిద్వారా 1994లో మేం 75 మిలియన్‌ డాలర్ల డివిడెండ్‌ పొందాం. 2022లో ఈ డివిడెండ్‌ 704 మిలియన్‌ డాలర్లకు పెరిగింది. పుట్టిన రోజుల్లాగే ఏటా ఇవీ వృద్ధి చెందాయి. నేనూ, చార్లీ ఈ నగదు డివిడెండ్ల కోసమే ఎదురు చూస్తుండేవాళ్లం. ఇవి మరింతగా పెరుగుతాయని ఆశించేవాళ్లం' అని బఫెట్‌ వివరించారు.


అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌లోనూ ఇలాగే జరిగింది. 1995లో అమెక్స్‌ (American Express) షేర్ల కొనుగోలు పూర్తైంది. అప్పటికి పెట్టుబడి విలువ 1.3 బిలియన్లు. తొలి ఏడాది 41 మిలియన్‌ డాలర్ల డివిడెండ్‌ పొందారు. 2022లో ఇది 302 మిలియన్‌ డాలర్లకు పెరిగింది. 'ఈ డివిడెండ్ల పెరుగుదల ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. వీటితో పాటు షేర్ల విలువా పెరిగింది. ఈ ఆర్థిక ఏడాది చివరికి కోక్‌లో పెట్టుబడి విలువ 25 బిలియన్‌ డాలర్లు, అమెక్స్‌లో 22 బిలియన్‌ డాలర్లకు ఎగిసింది. బెర్క్‌షైర్‌ నెట్‌వర్త్‌లో (Berkshire Hathaway) ఈ రెండింటి వాటా 5 శాతం వరకు ఉంటుంది' అని బఫెట్‌ తెలిపారు.


ఇదే డబ్బును అమెక్స్‌, కోకాకోలా బదులు 30 ఏళ్ల హై గ్రేడ్‌ బాండ్లలో పెట్టుంటే బెర్క్‌షైర్‌ హాత్‌వే విలువలో 0.3 శాతమే ఉండేది. 'ఓసారి ఇలా ఊహించుకోండి. ఇదే పరిమాణంలో పెట్టుబడిని వృద్ధిలేని స్టాక్స్‌లో పెట్టుంటే 2022లో అది 1.3 బిలియన్‌ డాలర్లు అయ్యేది. ఉదాహరణకు హైగ్రేడ్‌ 30 ఏళ్ల బాండ్లు. మా కంపెనీ విలువలో దీని వాటా 0.3 శాతంగా ఉండేది. ఏటా 80 మిలియన్‌ డాలర్ల ఆదాయం వచ్చేది' అని బఫెట్‌ పేర్కొన్నారు.


Also Read: రైతన్నలూ! నేడే మీ ఖాతాల్లో రూ.2000 జమ అవుతాయ్‌!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌ (Stock Market), క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.