EPFO: లక్షల మందికి శుభవార్త చెబుతూ, అంతా ఎదురు చూస్తున్న (నిర్దిష్ట సభ్యులకు) అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ దరఖాస్తును ఆదివారం అర్ధరాత్రి EPFO ‍‌(Employees Provident Fund Organisation) ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు, ఈ ఆప్షన్‌ లింక్‌ను ఈపీఎఫ్‌వో తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. నవంబర్ 4, 2022 నాడు ఇచ్చిన తీర్పులో, EPS కింద అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి  సుప్రీంకోర్టు 4 నెలల సమయాన్ని ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.


ప్రస్తుత లింక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు?          
2014 సెప్టెంబరు 1 నాటికి EPF సభ్యులుగా ఉండి, ఆ తరువాత కూడా సభ్యులుగా కొనసాగి, అధిక వేతనంపై ఈపీఎఫ్‌ చందా చెల్లిస్తూ, గత గడువులోగా EPS చట్టంలోని పేరా నంబర్‌ 11(3) కింద యాజమాన్యంతో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వలేకపోయిన వారు మాత్రమే ప్రస్తుత లింక్‌ ద్వారా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని EPFO ప్రకటించింది. యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చేందుకు తుది గడువు 2023 మే నెల 3వ తేదీగా పేర్కొంది. అర్హులైన వారంతా ఈ గడువులోగా ఉమ్మడి ఆప్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని భవిష్య నిధి సంస్థ స్పష్టం చేసింది.


ఎలా దరఖాస్తు చేసుకోవాలి?       
ఉద్యోగులు, పింఛనుదార్లు ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వడం కోసం, ఆదివారం అర్ధరాత్రి, EPF మెంటర్‌ పోర్టల్‌ హోంపేజీలో ప్రత్యేక లింకును EPFO ఏర్పాటు చేసింది. హోంపేజీలో "అప్లికేషన్‌ ఫర్‌ జాయింట్‌ ఆప్షన్‌ లింక్‌"ను (Application for Joint Option Link) అర్హులైన దరఖాస్తుదార్లు క్లిక్‌ చేయాలి. ఆ తరువాత EPS చట్టం 11(3) కింద ఆప్షన్‌ ఇవ్వడానికి అప్లై మీద క్లిక్‌ చేయాలి. UAN (యూనివర్సల్‌ అకౌంట్‌ నంబరు) అకౌంట్‌ ద్వారా ఆ దరఖాస్తును నింపాలి. దరఖాస్తులో అడిగిన - చందాదారు ఆధార్‌ నంబరు, పుట్టిన తేదీ వంటి వివరాలను "EEPO రికార్డుల్లో ఎలా ఉంటే అలా" నమోదు చేయాలి. ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌ను సమర్పించాలి. వివరాల సమర్పణ మొత్తం నాలుగు దశల్లో సాగుతుంది. మొత్తం వివరాలను పూర్తి చేశాక, తప్పులు ఉన్నాయేమో మరొక్కసారి చెక్‌ చేసుకోండి. ఇన్నీ ఓకే అనుకున్న తర్వాత ఉమ్మడి ఆప్షన్‌ దరఖాస్తును సమర్పించండి. ఇప్పుడు దరఖాస్తు నంబర్‌ మీకు వస్తుంది.


విశ్రాంత ఉద్యోగులకు మార్చి 3 వరకే గడువు      
సెప్టెంబరు 1, 2014 కి ముందు పదవీ విరమణ చేసి, పెన్షన్ పథకం కింద అధిక పెన్షన్‌ ఆప్షన్‌ ఎంచుకుని, అధిక జీతంపై చందాలు చెల్లించినా, అధిక పింఛను దరఖాస్తును గతంలో EPFO తిరస్కరించి ఉంటే... ఇప్పుడు వారి దరఖాస్తు సమర్పరణకు గడువు పొడిగించ లేదు. గతంలో ప్రకటించినట్లు 2023 మార్చి 3వ తేదీ లోపు వాళ్లు ఆప్షన్లు సమర్పించాలి. ఈ ఉద్యోగుల కోసం 2022 డిసెంబర్ 29వ తేదీన సర్క్యులర్ జారీ అయింది. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసేందుకు, 2023 జనవరిలో సంబంధిత ఫారం జారీ అయింది.