SBI Amrit Kalash Fixed Deposit: డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (Fixed Deposit) ఒక మంచి పెట్టుబడి మార్గంగా మారింది. స్థిరమైన ఆదాయంతో పాటు సురక్షిత పెట్టుబడి మార్గం కావడంతో, ఎక్కువ మంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వైపు చూస్తున్నారు.      


పెరుగుతున్న ఈ ట్రెండ్‌కు అనుగుణంగా, దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (State Bank Of India - SBI), ఒక కొత్త ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాన్ని ప్రకటించింది. ఇది 400 రోజుల పరిమిత కాల పథకం. దీని పేరు ‘అమృత్‌ కలశ్‌’ (SBI Amrit Kalash scheme). 


అమృత్‌ కలశ్‌ పథకంలో ఎంత వడ్డీ చెల్లిస్తారు?      
ఈ పరిమిత కాల డిపాజిట్‌ పథకంలో పెట్టుబడి పెట్టే సీనియర్‌ సిటిజన్లకు (60 సంవత్సరాలు లేదా ఆ వయస్సు దాటిన వాళ్లు) ఏటా 7.6 శాతం వడ్డీ రేటును స్టేట్‌ బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తోంది. సాధారణ పౌరులకు (60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వాళ్లు) ఏడాదికి 7.1 శాతం వడ్డీ రేటును బ్యాంక్‌ చెల్లిస్తోంది. ఉదాహరణ చూస్తే... ఎస్‌బీఐ అమృత్‌ కలశ్‌లో ఒక సీనియర్‌ సిటిజన్‌ ఒక 1 లక్ష రూపాయలు డిపాజిట్‌ చేస్తే, 7.6 శాతం వడ్డీ రేటు ప్రకారం 400 రోజులకు రూ. 8,600 వడ్డీ వస్తుంది. ఇదే పథకంలో, 7.6 శాతం వడ్డీ రేటు ప్రకారం 400 రోజులకు ఒక సాధారణ పౌరుడికి లభించే వడ్డీ మొత్తం 8,017 రూపాయలు.


ఆఫర్‌లో ఆఫర్‌    
ఈ స్పెషల్‌ ఆఫర్‌లో ఇమిడివున్న మరొక ఆఫర్‌ ఏంటంటే.. ఎస్‌బీఐ అమృత్‌ కలశ్‌ డిపాజిట్‌ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే ఎస్‌బీఐ సిబ్బంది, పింఛనుదార్లకు మరొక శాతం అదనపు వడ్డీ రేటు లభిస్తుంది.


అమృత్‌ కలశ్‌ ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది?     
2023 ఫిబ్రవరి 15న ప్రారంభమైన ఈ స్కీమ్‌ 2023 మార్చి 31 వరకే అందుబాటులో ఉంటుంది. అంటే, ఈ ఆర్థిక సంవత్సరంతో ఈ పథకం ఆగిపోతుంది. ఆ లాగా డిపాజిట్‌ చేసినవారికి మాత్రమే ఎస్‌బీఐ ఆఫర్‌ చేస్తున్న ప్రత్యేక వడ్డీ రేటు లభిస్తుంది.


అమృత్‌ కలశ్‌ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?     
మీకు దగ్గరలో ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖకు మీరు స్వయంగా వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడి వరకు వెళ్లేంత సమయం మీకు లేకపోతే ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఎస్‌బీఐ యోనో (SBI YONO) యాప్‌ ద్వారా కూడా ఈ స్కీం కోసం అప్లై చేసుకోవచ్చు.


ఈ స్కీమ్‌ను మెచ్యూరిటీ తేదీ కంటే ముందుగానే రద్దు చేసుకునే సదుపాయం కూడా ఉంది. దీంతో పాటు, ఈ డిపాజిట్‌ను మీద బ్యాంక్‌ లోన్‌ కూడా వస్తుంది.    


అమృత్‌ కలశ్‌ పథకంపై మీరు తీసుకునే వడ్డీపై, ఆదాయ పన్ను చట్టం ప్రకారం, TDS (Tax Deducted at Source) కట్‌ అవుతుందని గుర్తుంచుకోండి. ఇలా కట్‌ అయిన మొత్తాన్ని, మీరు ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేసే సమయంలో క్లెయిమ్‌ చేసుకోవచ్చు.