ఏపీకి ఇద్దరు కేంద్ర మంత్రులు రానున్నారు. అటు పార్టీ కార్యక‌లాపాల‌తో పాటుగా ఇటు రాష్ట్రంలో అమ‌లు అవుతున్న కేంద్ర ప్రభుత్వ ప‌థకాల‌ను ఇద్దరు మంత్రులు ఆరా తీస్తున్నారు. ప్రవాస్ యోజనలో భాగంగా ఇద్దరు కేంద్ర మంత్రులు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పర్యటించనున్నారు. విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులు పర్యటిస్తారు. మంత్రుల పర్యటన ఏవిధంగా ఉండాలన్న అంశాలపై రాష్ట్ర ప్రవాస్ యోజన కమిటీ ఇప్పటికే ఒక సమావేశం నిర్వహించి, కార్యకర్తలకు పర్యటనపై సమాచారం అందించారు.


కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలు ఏపీలో అమలుతో పాటు సామాన్య కార్యకర్త ఇంట్లో భోజనం ఏర్పాటు కూడా చేస్తున్నారు. అదే విధంగా మండల స్ధాయిలో పార్టీ యోజన ఏ విధంగా ఉంది అనే అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దిశగానే కేంద్ర మంత్రుల పర్యటనలు ఉండబోతున్నాయి. ఈ నెల 10, 11 తేదీలలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రి నారాయణ స్వామి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు. ఈ నెల 11, 12 తేదీలలో కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి భారతీ పవార్ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో  నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇప్పటికే ఈ ఇద్దరు కేంద్ర మంత్రుల ఆయా పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో మెద‌టి ద‌ఫా ప‌ర్యట‌న‌ను పూర్తిచేసుకున్నారు. ఇప్పుడు రెండోసారి ఇద్దరు కేంద్ర మంత్రులు ఆయా పార్లమెంట్ల ప‌రిధిలో ప‌ర్యటిస్తున్నారు. మెద‌టిసారి జరిగిన ప‌ర్యట‌న సంద‌ర్బంగా చోటుచేసుకున్న ప‌రిణామాలు ఇప్పుడు రెండోసారి జ‌రిగే ప‌ర్యట‌న‌లో వాటి పురోభివృద్దిని గురించి వాక‌బు చేయ‌నున్నారు.
అటు పార్టీ.. ఇటు ప్రభుత్వం
ఏపీలో బీజేపి పార్టీని బ‌లోపేతం చేయ‌టంతో పాటు, రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న నిధులు.. వాటి వినియోగంపై కూడా విస్తృతంగా ప్రచారం చేసేందుకు ప్రయ‌త్నిస్తున్నారు బీజేపీ నేతలు. ఇందులో భాగంగానే మెద‌టి ద‌ఫా ప‌ర్యట‌న త‌రువాత రెండోసారి కేంద్ర మంత్రులు ఏపీలో ప‌ర్యటిస్తున్నారు. దీని వల్ల గతంలో తాము ఏ విషయాలు చెప్పాం, ఇప్పుడు పరిస్థితి ఏంటని.. భవిష్యత్ లో చేయబోయే పనులు, చేపట్టనున్న కార్యక్రమాలను  వివ‌రించ‌టం ముఖ్య ఉద్దేశమ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. 
గ‌తంలో లాగా ఒకసారి హామీ ఇచ్చి, మ‌రోసారి అటువైపు చూడ‌కుండా వెళ్ళటం త‌మ నైజం కాద‌ని, కేంద్రం నుంచి రాష్ట్రానికి వ‌స్తున్న నిధులు వాటిని ఎలా వినియోగిస్తున్నారు,అందులో లోటుపాట్లు ఎంటి,ప్ర‌జ‌లకు ఎంత మేర మేలు క‌లిగింద‌నే విష‌యాలు కూడ చ‌ర్చ జ‌రుగుతుంద‌ని అంటున్నారు.
డ‌బుల్ ఇంజ‌న్ కోసం ప్రయ‌త్నాలు 
ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ డబుల్ ఇంజ‌న్ ఫార్ములాను ప్రచారంలోకి తెస్తోంది. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాబ‌ట్టి, రాష్ట్రంలో కూడా బీజేపీ సర్కార్ వస్తేనే.. అభివృద్ది మరింత దూకుడుగా సాగుతుంద‌ని, ఏపీలో కుటుంబ పాల‌న వ‌ల‌న న‌ష్టాలు అధికంగా ఉంటున్నాయ‌ని చెప్పేందుకు కాషాయ ద‌ళం య‌త్నిస్తోంది. అయితే డ‌బుల్ ఇంజ‌న్ ఫార్ములా ఇప్పుడు వర్కౌట్ అయినా కాక‌పోయినా, 2029 నాటికి అయినా ఏపీలో బీజేపీ సొంతంగా నిల‌దొక్కుకుంటుంద‌ని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.