Suresh Gopi Hails Indira Gandhi: కేరళలో ఈ సారి ఖాతా తెరిచింది బీజేపీ. లోక్‌సభ ఎన్నికల్లో ఓ ఎంపీ సీటు గెలుచుకుంది. మలయాళ నటుడు సురేశ్ గోపి బీజేపీ తరపు త్రిసూర్‌లో పోటీ చేసి విజయం సాధించారు. కేంద్ర కేబినెట్‌లోనూ చోటు దక్కించుకున్నారు. కేరళలో బీజేపీ ఉనికి చాటేందుకు సురేశ్ గోపికి ఇలా ప్రాధాన్యతనిచ్చింది హైకమాండ్. ఈ క్రమంలోనే మాజీ ప్రధాని ఇందిరా గాంధీని "మదర్ ఆఫ్ ఇండియా" అని ప్రశంసించారు. అంతే కాదు. కేరళ మాజీ ముఖ్యమంత్రి కె కరుణాకరన్‌నీ ఇలాగే పొగడ్తలతో ముంచెత్తారు. చాలా ధైర్యవంతుడు అని అన్నారు. కరుణాకరన్ స్మారకాన్ని సందర్శించిన తరవాత సురేశ్ గోపీ ఈ వ్యాఖ్యలు చేశారు. కరుణాకరన్ కొడుకు కాంగ్రెస్ నేత మురళీధరన్‌పై పోటీ చేసి గెలుపొందారు సురేశ్ గోపీ. అయితే...తన వ్యాఖ్యల్ని రాజకీయం చేయొద్దని తేల్చి చెప్పారు. కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టం చేశారు.
కేంద్ర పర్యాటక, పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఆయన త్వరలోనే ఆ పదవికి రాజీనామా చేస్తారని అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే విషయమైన మీడియా ప్రశ్నించగా అవి పుకార్లే అని కొట్టి పారేశారు. మోదీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం నుంచి తాను ఎందుకు బయటకు వస్తానని తిరిగి ప్రశ్నించారు. కొన్ని ఛానల్స్ ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు.
"కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయి. మోదీ కేబినెట్ నుంచి నేను బయటకు వచ్చేస్తానని ఏవేవో చెబుతున్నాయి. ఇది పూర్తిగా అవాస్తవం. మోదీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేస్తుండడం నాకు చాలా గర్వంగా ఉంది. కేరళ ప్రజల ప్రతినిధిగా నేను గర్వపడుతున్నాను"
- సురేశ్ గోపి, కేంద్ర సహాయ మంత్రి