Visakha Steel Home Delivery: విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆదాయ మార్గాలను అన్వేషించుకునే పనుల్లో స్టీల్ ప్లాంట్ పడింది. నష్టాలను షాకుగా చూపించి కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ను లాభాలు బాటలో పయనించేలా చేసేందుకు కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే వినూత్న ఆలోచనతో స్టీల్ విక్రయాలు చేపట్టేందుకు యాజమాన్యం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు సంస్థలకే బల్క్ గా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులను విశాఖ ఉక్కు సంస్థ విక్రయిస్తూ వస్తోంది. అయితే, ఇకపై ప్రతి ఇంటికి ఉత్పత్తులను చేరువ చేసే దిశగా కార్యాచరణ రూపొందించారు. డిజిటల్ ఇండియాలో భాగంగా ఆన్లైన్ పోర్టల్ ను అభివృద్ధి చేసిన రాష్ట్రీయ ఇస్సాత్ నిగమ్ లిమిటెడ్(ఆర్ఐఎన్ఎల్) ఇంటి నుంచే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులను బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. హాట్ మెటల్, ముడి ఉక్కు, సేలబుల్ స్టీల్ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి సాధిస్తూ 17 శాతానికి పైగా విక్రయ వృద్ధి సాధించింది విశాఖ స్టీల్ ప్లాంట్. ఈ క్రమంలోనే మరింతగా స్టీల్ విక్రయాలను పెంచే ఉద్దేశంతో తాజా విధానానికి శ్రీకారం చుట్టారు స్టీల్ ప్లాంట్ అధికారులు. 


నేరుగా ప్రజలకు స్టీల్ ఉత్పత్తులు విక్రయం..


ఇప్పటి వరకు స్టీల్ ప్లాంటు ఉత్పత్తులను వివిధ కంపెనీలు, స్టీల్ వ్యాపార సంస్థలు, హార్డ్వేర్ దుకాణాలకు విక్రయిస్తూ వచ్చారు. అయితే, ఇకపై తమ ఉత్పత్తులని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సరికొత్త మార్గాన్ని ఎంపిక చేశారు. ప్రతి ఇంటికి విశాఖ ఉత్పత్తులు చేరేందుకు అనుగుణంగా ఆన్లైన్ పోర్టల్ ను ఆర్ఐఎన్ఎల్ అధికారులు అభివృద్ధి చేశారు. ఈ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో లో ఆర్డర్ చేయడం ద్వారా సులువుగా నాణ్యమైన స్టీల్ ఉత్పత్తులని డోర్ డెలివరీ చేయనున్నారు. ఇందుకోసం ఆర్ఐఎన్ఎల్ ఈ సువిధ వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చింది. విశాఖ ఉక్కు పరిశ్రమలో ఉత్పత్తి అయ్యే ప్రతి వస్తువును ఆన్లైన్లో ఈ వెబ్ పోర్టల్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. vizagsteel.com వెబ్సైట్ కి వెళ్లి అందుబాటులో అందులో ఉన్న ఆర్ఐఎన్ఎల్ ఈ సువిధ లింకును ఓపెన్ చేసి రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. మీ అవసరాలకు ఏ తరహా ఉత్పత్తులు కావాలి,  ఎప్పటిలోగా కావాలనేది అందులో పేర్కొనాల్సి ఉంటుంది. అదే విధంగా డోర్ డెలివరీ చేయాల్సిన అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవ్వాలి. నిర్దేశించిన సమయానికి విశాఖ ఉక్కు ఉత్పత్తులు డోర్ డెలివరీ చేసేలా ఆర్ఐఎన్ఎల్ అధికారులు ఈ వ్యవస్థను రూపొందించారు. దీనివల్ల మరింతగా స్టీల్ ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఒకవైపు సంస్థలకు స్టీల్ ఉత్పత్తులను విక్రయిస్తూనే.. నేరుగా ప్రజలకు కూడా స్టీల్ ప్లాంట్ విక్రయాలను అందించడం ద్వారా మరింతగా ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని స్టీల్ ప్లాంట్ అధికారులు భావిస్తున్నారు. దీని ద్వారా స్టీల్ ప్లాంట్ ఆదాయం మరింత పెరగనుందని చెబుతున్నారు. ఇది ఒక రకంగా స్టీల్ ప్లాంటు నష్టాలను తగ్గించడం ద్వారా ప్లాంట్ ప్రేవైటీకరణ కాకుండా ప్రభావం చూపిస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు.