Hebah Patel About Mister Movie: కేవలం ఒక్క సినిమాతోనే ఎనలేని స్టార్‌డమ్‌ను తెచ్చుకొని ఆ తర్వాత హిట్ల కోసం కష్టపడుతున్న నటీనటులు చాలామందే ఉన్నారు. అలాంటి వారి లిస్ట్‌లో హెబ్బా పటేల్ కూడా యాడ్ అవుతుంది. తన కెరీర్‌లో కొన్ని బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంది.  కానీ ఇప్పుడు ఒక్క హిట్ కోసం ఈ భామ బాగా కష్టపడుతోంది. త్వరలోనే ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం  ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న హెబ్బా.. తన మునుపటి చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా ‘మిస్టర్’ మూవీపై ఒకప్పుడు తను చేసిన కామెంట్స్ విషయంపై ప్రశ్నించగా మాట మార్చి హోస్ట్ కే షాకిచ్చింది. 


కల నెరవేరింది..


మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా 2017లో వచ్చిన చిత్రం ‘మిస్టర్’. ఇందులో ఓ కీలక పాత్రలో నటించింది హెబ్బా పటేల్. సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో తను వరుణ్ తేజ్ సరసన నటించింది. ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించగా హెబ్బా సెకండ్ హీరోయిన్‌గా నటించింది. గతంలో ఈ సినిమాలో తను చేసిన క్యారెక్టర్ తనకు అస్సలు నచ్చలేదని, కెరీర్ మొత్తంలో తనకు అస్సలు నచ్చని క్యారెక్టర్ అదే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది హెబ్బా పటేల్. ఒకప్పుడు అలా ఎందుకు మాట్లాడింది అనే విషయంపై తాజాగా ఆమె స్పందించింది. ‘‘శ్రీను వైట్ల గారితో పనిచేయడం నా కల.  ఈ చిత్రంతో అది నెరవేరింది’’ అంటూ దర్శకుడి గురించి పాజిటివ్‌గా మాట్లాడింది.


రిగ్రెట్స్ లేవు..


‘‘ఒకప్పుడు అలా ఎందుకు అన్నానో తెలియదు కానీ ఆ సినిమాలో వర్క్ చేయడం నేను చాలా ఎంజాయ్ చేశాను. అలాంటి సినిమాల్లో నటించాలని నేను ఎప్పుడూ అనుకునేదాన్ని. కాబట్టి ఇప్పుడు దాని గురించి రిగ్రెట్స్ ఏం లేవు. అది వర్కవుట్ అవ్వలేదు అన్నది బాధాకరమైన విషయం కానీ దానికోసం అందరం ఒకేలా కష్టపడ్డాం’’ అని చెప్పుకొచ్చింది హెబ్బా పటేల్. అయితే అప్పుడలా ఎందుకు మాట్లాడావు, ఇప్పుడెందుకు ఇలా మాట మారుస్తున్నావు అనగా తన మ్యానేజర్ అలా మాట్లాడొద్దని చెప్పారని మొహమాటం లేకుండా చెప్పేసింది. తను ఏ సినిమా కూడా ఒప్పుకున్న తర్వాత రిగ్రెట్ అవ్వలేదని తెలిపింది.


అదే బాధాకరమైన విషయం..


తను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తన తల్లి కూడా తనతో పాటు షూటింగ్స్‌కు వచ్చేదని, తర్వాత తనకు బోర్ అయిపోయి రావడం లేదని చెప్పుకొచ్చింది హెబ్బా పటేల్. ‘కుమారి 21 ఎఫ్’ తర్వాత ‘దర్శకుడు’లో హీరోయిన్‌గా తనకు వచ్చిన ఛాన్స్ వచ్చినా డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో చేయలేకపోయానని బయటపెట్టింది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడు’ తర్వాత కూడా నిఖిల్‌తో నటించే ఛాన్స్ వచ్చినా ఎందుకో వర్కవుట్ అవ్వలేదని చెప్పింది. తన జీవితంలో అతి బాధాకరమైన సంఘటన గురించి చెప్తూ.. తను తండ్రిలాగా భావించే మావయ్య చనిపోవడమే తనను చాలా బాధపెట్టిందని తెలిపింది. ఇండస్ట్రీలో తనకు ఫ్రెండ్స్ లేరని, టాలీవుడ్‌లో ఫ్రెండ్ అనగానే తనకు టక్కున వెన్నెల కిషోర్ మాత్రమే గుర్తొస్తాడని చెప్పింది హెబ్బా పటేల్.



Also Read: ప్రెగ్నెన్సీ సమయంలో అలాంటి అనుభవం, దానివల్లే డిప్రెషన్ - నమిత