Committee Kurrollu Teaser Out Now: ఈమధ్యకాలంలో ఫ్రెండ్స్, ఫ్రెండ్‌షిప్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమాలు ఓ రేంజ్‌లో హిట్లను అందుకుంటున్నాయి. ఇక అదే బ్యాక్‌డ్రాప్‌లో నిహారిక కొణిదెల సమర్పిస్తున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. 11 మంది హీరోలు నటించిన ఈ సినిమా.. 90స్ కిడ్స్ జీవితాలపై తెరకెక్కిందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ మూవీలోని దాదాపు ప్రతీ క్యారెక్టర్‌కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని కూడా నమ్మకం వ్యక్తం చేశారు. తాజాగా విడుదలయిన ‘కమిటీ కుర్రోళ్ళు’ టీజర్ చూస్తుంటే మేకర్స్ చెప్పింది నిజమే అంటున్నారు ప్రేక్షకులు. యంగ్ హీరో నితిన్ చేతుల మీదుగా ఈ టీజర్ విడుదలయ్యింది.


చిన్నప్పటి అల్లరి..


‘‘చిన్నప్పుడే బాగుండేది కదా.. ఓ బరువు ఉండేది కాదు, ఓ బాధ్యత ఉండేది కాదు. మాకు తెలిసిందల్లా ఒకటే.. ఇడ్లీ మామ్మ కొట్టులో అందరం కలిసి ఒకే ప్లేట్‌లో ఇడ్లీలు తినడం, పంప్ సెట్ దగ్గర స్నానాలు చేయడం, క్రికెట్ ఆడుకోవడం, వినాయక చవితి ఊరేగింపులు, మా జాతర్లో ఆటలు’’ అనే ఫీల్ గుడ్ డైలాగ్‌‌తో ‘కమిటీ కుర్రోళ్ళు’ టీజర్ మొదలవుతుంది. చిన్నతనంలో ఉండే అమాయకత్వం, టీనేజ్‌లో చేసే అల్లరి.. ఇవన్నీ ఈ టీజర్‌లో పర్ఫెక్ట్‌గా చూపించాడు దర్శకుడు యదు వంశీ. టీజర్ అంతా దాదాపుగా చాలా సరదాగా సాగిపోయింది. ముఖ్యంగా ఇందులో కనిపించే నటీనటులను ముందెప్పుడూ చూడలేదు అనిపించినా.. అందరూ బాగా యాక్ట్ చేశారని మాత్రం ఆడియన్స్ ఫీలవుతారు.


సీరియస్ టర్న్..


‘‘చిన్నప్పుడు ఉన్న సంతోషం 18 ఏళ్లు దాటాక ఉండదు కదా’’ అనే డైలాగ్‌తో ‘కమిటీ కుర్రోళ్ళు’ టీజర్ సీరియస్ టర్న్ తీసుకుంటుంది. మొత్తానికి ఒక ఫీల్ గుడ్ మ్యూజిక్‌తో ఈ టీజర్ ఎండ్ అవుతుంది. నిహారిక కొణిదెల సమర్పణలో తెరకెక్కిన ఈ మూవీని పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక, రచన నిర్మాతలుగా వ్యవహరించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా  ‘కమిటీ కుర్రోళ్ళు’ను నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించుకోవడంతో అప్పుడే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది మూవీ టీమ్. అందులో భాగంగానే ఇప్పటికే ‘కమిటీ కుర్రోళ్ళు’ నుండి టీజర్‌తో పాటు ఒక పాట కూడా విడుదలయ్యింది.



సమానంగా ప్రాధాన్యత..


‘కమిటీ కుర్రోళ్ళు’ గురించి ప్రకటించి కొంతకాలమే అయ్యింది. అయినా అనుకున్నదానికంటే ముందే మూవీ షూటింగ్‌ను పూర్తిచేశారు మేకర్స్. ఇందులో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాధ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వీ రావు, టీనా శ్రావ్య, విషిక, షణ్ముకి నాగుమంత్రి లీడ్ రోల్స్‌లో నటించారు. ఇందులో నటిస్తున్న నటీనటుల సంఖ్య ఎక్కువే అయినా అందులో ప్రతీ పాత్రకు దర్శకుడు యదు వంశీ సమానంగా ప్రాధాన్యత ఇచ్చాడని ‘కమిటీ కుర్రోళ్ళు’ టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ మూవీలో సాయి కుమార్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.


Also Read: వాళ్ల కారణాలు వాళ్లకు ఉంటాయి - అల్లు అర్జున్‌ను సాయి దుర్గా తేజ్ అన్‌ఫాలో చేయడంపై నిహారిక కామెంట్స్