Beti Padhao Beti Bachao: మోదీ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం బేటీ పఢావో, బేటీ బచావో. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దీనిపై ప్రచారం చేస్తోంది ప్రభుత్వం. ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన క్రమంలో పలు రాష్ట్రాల్లో మరోసారి ఈ నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే స్కూల్స్ రీఓపెన్ కావడం వల్ల ఈ క్యాంపెయిన్ కొనసాగిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో School Chalo Abhiyan కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి కేంద్రమంత్రి సావిత్రి ఠాకూర్ హాజరయ్యారు. ఆ సమయంలోనే ఆమె బోర్డ్‌పైనా బేటీ పఢావో, బేటీ బచావో (Beti Padhao, Beti Bachao) అని స్కెచ్‌తో రాశారు. కానీ స్పెలింగ్‌ తప్పుగా రాసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సావిత్రి ఠాకూర్ బేటీ పడావో బదులుగా Beddi Padao Bachav అని రాశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాంగ్రెస్‌ ఆ మంత్రిపై తీవ్ర విమర్శలు చేస్తోంది. కనీస విద్యార్హతలు కూడా లేకుండా మంత్రి అవడంపై అసహనం వ్యక్తం చేస్తోంది. ఆమె క్వాలిఫికేషన్‌పైనా అనుమానాలు వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో ఇంత కన్నా దురదృష్టకరమైన విషయం ఇంకోటి ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతృభాష కూడా సరిగ్గా రాయలేని వ్యక్తికి అంత పెద్ద పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. 


"మన ప్రజాస్వామ్యం దురదృష్టం ఇది. మాతృభాష  సరిగ్గా రాయలేని వాళ్లు కూడా అంత పెద్ద పెద్ద పదవుల్లో ఉంటున్నారు. ఇలాంటి వ్యక్తి మంత్రి బాధ్యతల్ని ఎలా నిర్వర్తిస్తారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీస విద్యార్హతలు ఉండాలన్న నిబంధన తీసుకురావాలి. ఓవైపు అక్షరాస్యత గురించి అంత చర్చ జరుగుతుంటే మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేస్తే ఎలా"


- కేకే మిశ్రా, కాంగ్రెస్ సీనియర్ నేత 




2015లో  బేటీ పఢావో, బేటీ బచావో కార్యక్రమాన్ని ప్రారంభించింది మోదీ ప్రభుత్వం. లింగ సమానత్వంతో పాటు బాలికా విద్యని ప్రోత్సహించేందుకు ఈ స్కీమ్‌ని ప్రవేశపెట్టింది. ఇంత కీలకమైన పథకం పేరుని తప్పు రాస్తే ఎలా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అయితే..అటు బీజేపీ నేతలు మాత్రం పొరపాటున జరిగిపోయిందని, కావాలనే కాంగ్రెస్ ఇలాంటి విమర్శలు చేస్తోందని మండి పడుతున్నారు. మోదీకి రబ్బర్ స్టాంప్‌ మంత్రులుంటే చాలా అని మరి కొందరు ఫైర్ అవుతున్నారు. ప్రజాప్రతినిధి చదువుకోకపోతే ఎలా అని అడుగుతున్నారు.