England vs West Indies Highlights In T20 World Cup 2024:  సూపర్‌ ఎయిట్‌( Super 8) పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లండ్‌(England) తొలి అడుగు బలంగా వేసింది. ఆతిథ్య వెస్టిండీస్‌(West Indies)తో జరిగిన మ్యాచ్‌లో సాధికార విజయం సాధించింది. ఈ టీ 20 ప్రపంచకప్‌( T20 World Cup 2024) పరంగా చూస్తే భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్లు జూలు విదిల్చారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ మరో 15 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఇంగ్లాండ్ ఓపెనర్‌ ఫిల్ సాల్ట్‌(Phil Salt) 47 బంతుల్లో 87 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. 




 

సమష్టిగా రాణించారు

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌... విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. విండీస్‌ ఓపెనర్లు బ్రెండన్ కింగ్‌-జాన్సన్‌ చార్లెస్‌ కరెబియన్లకు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించిన అనంతరం బ్రెండన్‌ కింగ్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు.  అనంతరం జాన్సన్‌తో జత కలిసిన నికోలస్‌ పూరన్‌ విండీస్‌ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. వీరిద్దరూ కలిసి విండీస్‌ను భారీ స్కోరు దిశగా నడిపించారు. 5 ఓవర్లలోనే విండీస్‌ 50 పరుగులు చేసింది. పవర్‌ ప్లే ముగిసే సరికి వెస్టిండీస్‌ ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా 58 పరుగులు చేసింది. 32 బంతుల్లోనే పూరన్‌- జాన్సన్‌ 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 34 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సుతో 38 పరుగులు చేసి చార్లెస్‌ అవుటయ్యాడు. మొయిన్‌ అలీ... చార్లెస్‌ను అవుట్ చేశాడు. అయినా నికోలస్‌ పూరన్‌, రోమెన్‌ పావెల్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేశారు. పావెల్‌ క్రీజులో ఉన్నంతసేపు మెరుపు బ్యాటింగ్ చేశాడు. కేవలం 17 బంతుల్లో అయిదు భారీ సిక్సర్లతో పావెల్‌ 36 పరుగులు చేసి లివింగ్‌ స్టోన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే 32 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సుతో సరిగ్గా 36 పరుగులే చేసి నికోలస్‌ పూరన్‌ కూడా అవుటయ్యాడు.  141 పరుగుల వద్ద పూరన్‌ మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. చేతిలో మరో నాలుగు వికెట్లు ఉండడం... ఆండ్రూ రస్సెల్‌ క్రీజులోకి రానుండడంతో విండీస్‌ మరింత భారీ స్కోరు చేస్తుందని అంతా అనుకున్నారు. అయితే రస్సెల్‌ పూర్తిగా నిరాశపరిచాడు. రెండు బంతులు ఎదుర్కొన్న రస్సెల్‌ ఒక్క పరుగు మాత్రమే చేసి అదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. చివర్లో రూథర్‌ఫోర్డ్‌ 15 బంతుల్లో ఒక ఫోర్‌, రెండు సిక్సర్లతో 28 పరుగులు  చేయడంతో విండీస్‌ విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. 

 

సాల్ట్‌ విధ్వంసం

181 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు శుభారంభం దక్కింది. బ్రిటీష్‌ జట్టు ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌-జోస్‌ బట్లర్‌ తొలి వికెట్‌కు ఏడు ఓవర్లలోనే 67 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు. జోస్‌ బట్లర్‌ 22 బంతుల్లో 25 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. తర్వాత కాసేపటికే మొయిన్‌ అలీ 10 బంతుల్లో 13 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో పది ఓవర్లలో 84 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సాల్ట్‌తో జత కలిసిన బెయిర్‌ స్టో మరో వికెట్‌ పడకుండా ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించాడు. సాల్డ్‌ మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 47 బంతులు ఎదుర్కొన్న సాల్ట్‌ 7 ఫోర్లు, అయిదు సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బెయిర్‌ స్టో 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో ధాటిగా ఆడి 48 పరుగులు చేయడంతో మరో  15 బంతులు మిగిలి ఉండగానే మూడే వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్‌ విజయం సాధించింది.