USA vs SA: టీ 20 ప్రపంచకప్(T20 World Cup 2024)లో సూపర్ ఎయిట్(Super 8) తొలి మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. లీగ్ దశలో అద్భుత పోరాటాలతో ఆకట్టుకున్న అమెరికా(USA) మరోసారి అదే పని చేసింది. సౌతాఫ్రికా(SA)తో జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్యం కళ్ల ముందు కనపడుతున్నా ఛేదించేందుకు ప్రయత్నించింది. దీంతో సునాయసంగా గెలుస్తుందనుకున్న దక్షిణాఫ్రికాకు కష్టాలు తప్ప లేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం అమెరికా కూడా 176 పరుగులు చేసి పోరాడింది. అమెరికా బ్యాటర్ గౌస్ మెరుపు బ్యాటింగ్‌తో సౌతాఫ్రికాకు ఓ దశలో ఓటమి భయం కలిగించాడు. కానీ మిగిలిన బ్యాటర్లు ఎవరూ మద్దతు ఇవ్వకపోవడంతో అమెరికాకు ఓటమి తప్పలేదు.
రాణించిన డికాక్
అంటిగ్వాలోని సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అమెరికా బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ కీలక ఇన్నింగ్స్ ఆడడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరుకు బాటలు పడ్డాయి. 16 పరుగుల వద్ద ఓపెనర్ రీజా హెండ్రింక్స్‌ను అవుట్ చేసిన నేత్రావల్కర్ దక్షిణాఫ్రికా తొలి వికెట్ తీశాడు. ఈ ఆనందం అమెరికాకు ఎక్కువసేపు నిలువలేదు. క్వింటన్ డికాక్‌తో జత కలిసిన మార్క్రమ్.. అమెరికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. వీరిద్దరూ కలిసి దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా స్కోరు బోర్డు పరిగెత్తింది. 4.5 ఓవర్లలోనే 50 పరుగులు చేశారు.
పవర్ ప్లేలో ఆరు ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 64 పరుగులు చేసి సౌతాఫ్రికా పటిష్టంగా నిలిచింది. పవర్ ప్లే తర్వాత కూడా అదే దూకుడు కొనసాగించిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు 9.5 ఓవర్లలోనే వంద పరుగులు చేశారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ కేవలం 26 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో అర్ధ సెంచరీ చేశాడు. పది ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 101 పరుగులు చేసిన ప్రొటీస్ సునాయసంగా 200 పరుగుల మార్క్‌ను దాటుతుందని అనుకున్నారు. కానీ 126 పరుగుల వద్ద డికాక్ వికెట్ పడడంతో స్కోరు వేగం తగ్గింది. హర్మీత్ సింగ్ ఒకే ఓవర్లో వరుస రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను దెబ్బ కొట్టాడు. 40 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో డికాక్ 74 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అదే స్కోరు వద్ద డేవిడ్ మిల్లర్ కూడా ఆడిన తొలి బంతికే అవుట్ కావడంతో ప్రొటీస్ భారీ స్కోరు ఆశలు ఆవిరయ్యాయి. ఆ తర్వాత క్లాసెన్, స్టబ్స్ కాస్త దూకుడుగా ఆడారు. క్లాసెన్ 22 బంతుల్లో 36 పరుగులు, స్టబ్స్ 16 బంతుల్లో 20 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోరు చేసింది. అమెరికా బౌలర్లలో నేత్రావల్కర్ 2, హర్మీత్‌సింగ్ రెండు వికెట్లు తీశారు.
గౌస్ ఒంటరి పోరాటం
195 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా... 76 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి ఓటమిని ఖాయం చేసుకుంది. అయితే ఆండ్రీస్ గౌస్ ఒంటరి పోరాటంతో ఓ దశలో దక్షిణాఫ్రికాకు ఓటమి భయం కలిగింది. గౌస్ 47 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు గౌస్ కేవలం 33 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. గౌస్‌కు హర్మీత్‌సింగ్ మంచి సహకారం అందించాడు. హర్మీత్ సింగ్ కూడా 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 38 పరుగులు చేయడంతో అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఛేదించాల్సిన రన్‌రేట్ భారీగా ఉండడంతో అమెరికా ఓటమి ఖరారైంది.