Megastar Chiranjeevi Cograjulated Ap Minster Kandula Durgesh: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ తో పాటు కొంతమంది మంత్రులు కూడా తమ బాధ్యతలను తీసుకుంటున్నారు. మంత్రులకు ఆయా శాఖలను కేటాయించిన సీఎం చంద్రబాబు. జనసేన నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కందుల దుర్గేశ్ కి ఏపీ పర్యాటక, సినిమాటోగ్రఫీ బాధ్యతలను అప్పగించారు. ఈసందర్భంగా ఆయన మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ‘విశ్వంభర’ సెట్స్ లో చిరుతో కలిసి కొన్ని విషయాలపై చర్చించారు. ఆ విషయాన్ని చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కందుల దుర్గేష్ ని కలవడం ఆనందంగా ఉంది అంటూ ఆయన ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేశారు.
అయితే, గతంలో చిరంజీవి టాలీవుడ్ సమస్యలను విన్నవించేందుకు తోటి హీరోలు, దర్శక నిర్మాతలతో కలిసి అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారడంతో.. స్వయంగా మంత్రే చిరంజీవిని కలిసి టాలీవుడ్ సమస్యలను తీరుస్తామని హామీ ఇవ్వడంపై చిరు ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎంతో ఆనందంగా ఉంది..
కందుల దుర్గేష్, చిరంజీవి మొదటి నుంచి మంచి మిత్రులు. అదికాకుండా సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమితులు కావడంతో చిరంజీవిని కలిశారు ఆయన. "మిత్రుడు కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ‘విశ్వంభర’ సెట్స్‌లో ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని నా శుభాకాంక్షలు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు, అభివృద్ధికి చొరవ తీసుకుంటానని చెప్పారు. ఆయన సానుకూలతకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. అలాగే పర్యాటకరంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను" అంటూ చిరంజీవి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ఈసందర్బంగా ఒక వీడియో పోస్ట్ చేశారు ఆయన.
'విశ్వంభర' సెట్స్ కి వచ్చిన మంత్రితో చిరంజీవి చాలాసేపు ముచ్చటించారు. ఈసందర్బంగా ఆయనకు చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు మరికొంతమంది యాక్టర్స్, చోటాకే నాయుడు, కీరవాణి తదితరలు పాల్గొన్నారు. విశ్వంభర సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకి వశిష్ట డైరెక్షన్ చేస్తుండుగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
నిడదవోలు నుంచి ఎమ్మెల్యేగా..
2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 21 సీట్లలో పోటీ చేసింది. కందుల దుర్గేశ్ కి నిడదవోలు సీటు కేటాయించగా.. ఆయన గెలుపొందారు. ఇక మంత్రి వర్గంలో జనసేనకు మూడు మంత్రి పదవులు ఇవ్వగా అందులో ఒకటి కందుల దుర్గేశ్‌కు దక్కింది. ఈయన గతంలో 2007 - 13 వరకు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా చేశారు. జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలో చేరిన దుర్గేశ్.. 2019లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక ఈ ఎన్నికల్లో కూడా రాజమండ్రి రూరల్ సీటు ఆశించినప్పటికీ ఆయనకు నిడదవోలు కేటాయించగా.. సమీప అభ్యర్థి గడ్డం శ్రీనివాస నాయుడుపై విజయం సాధించారు.