Bhopal Gas Tragedy : ప్రపంచంలోనే అత్యంత దారుణమైన దుర్ఘటనగా పేరొందిన భోపాల్ గ్యాస్ విషాదం జరిగి 40ఏళ్లు కావస్తున్నా.. ప్రమాదం మిగిల్చిన ఆనవాళ్లు ఇంకా అలానే ఉన్నాయి. ఈ ఘటనలో ఏర్పడిన వ్యర్థాలు ఇంకా అక్కడే ఉండిపోయాయి. యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (UCIL) ఆవరణలో వందల టన్నుల విష వ్యర్థాలు మిగిలి ఉన్నాయని తెలిసిందే. దీనిపై కోర్టు ఆదేశాలు,హెచ్చరికలు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వ అధికారులు మాత్రం ఈ వ్యర్థాలను సురక్షితంగా డిస్పోజ్ చేసే ప్రయత్నం చేయలేదు. అయితే మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో ఇప్పుడు పనికిరాని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుండి 377 మెట్రిక్ టన్నుల ప్రమాదకర వ్యర్థాలను తొలగించే పనిని అధికారులు డిసెంబర్ 29న ఆదివారం రోజు తలపెట్టారు. ఇండోర్ సమీపంలో ప్రణాళికాబద్ధంగా పారవేయడానికి సిద్ధమవుతున్నారు.
ఈ విషయంలో సుప్రీంకోర్లు పలుమార్లు మందలించినప్పటికీ అధికారులు మాత్రం చర్యలు తీసుకోలేదు. మధ్యప్రదేశ్ హైకోర్టు సైతం ఈ విషయంపై సీరియస్ అయింది. ఇది జరిగిన కొన్ని వారాల తర్వాత ఇప్పుడు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ వ్యర్థాలు మరో విషాదానికి కారణం కావచ్చనే అంచనాల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది.
విషపూరిత వ్యర్థాల తరలింపు
ప్రత్యేకంగా రీన్‌ఫోర్స్డ్ కంటైనర్‌లతో కూడిన అరడజను GPS-ఎనేబుల్డ్ ట్రక్కులు ఆదివారం ఉదయం ఫ్యాక్టరీ సైట్‌కు చేరుకున్నాయి. స్పెషల్ PPE కిట్‌లు ధరించిన పలువురు కార్మికులు, భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పర్యావరణ సంస్థలు, వైద్యులు, ఇతరణ నిపుణులు సైట్‌లో పని చేయడం కనిపించింది. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ చుట్టూ పోలీసులు మోహరించారు. అయితే ఈ విషపూరిత వ్యర్థాలను భోపాల్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఇండోర్ సమీపంలోని పితాంపూర్‌లోని దహన ప్రదేశానికి తరలించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
చర్యలు తప్పవన్న హైకోర్టు
ఫ్యాక్టరీ నుండి విషపూరిత వ్యర్థాలను తరలించడానికి డిసెంబర్ 3న మధ్య ప్రదేశ్ హైకోర్టు నాలుగు వారాల గడువు విధించింది, గ్యాస్ విపత్తు జరిగిన 40 సంవత్సరాల తరువాత కూడా అధికారులు మేలుకోవడం లేదని నిందించింది. దీన్ని "సారీ స్టేట్ ఆఫ్ ఎఫైర్స్"గా అభివర్ణించిన కోర్టు, తన ఆదేశాలను పాటించకపోతే ధిక్కార చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దీనిపై జనవరి 6, 2025న హైకోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది.
వ్యర్థాల కాల్చివేతకు తొమ్మిది నెలల సమయం
భోపాల్ గ్యాస్ దుర్ఘటన మిగిల్చిన వ్యర్థాలను సురక్షితంగా పితాంపూర్‌కు పంపుతామని రాష్ట్ర గ్యాస్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ తెలిపారు. దీన్ని అతి తక్కువ సమయంలో రవాణా చేసేందుకు దాదాపు 250 కి.మీ మేర గ్రీన్ కారిడార్‌ను రూపొందించనున్నట్లు చెప్పారు. ఎప్పుటికి పూర్తవుతుందన్న దానిపై స్పందించిన సింగ్.. నిర్దిష్ట తేదీని ఇవ్వలేకపోయారు. కానీ ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని, జనవరి 3 నాటికి వ్యర్థాలు దాని గమ్యస్థానానికి చేరుకోవచ్చని వర్గాలు తెలిపాయి. మొదట్లో కొంత భాగాన్ని కాల్చేసి అందులో ఇంకా ఏదైనా హానికరమైన మూలకం ఉందో లేదో తెలుసుకోవడానికి అవశేషాలను (బూడిద) శాస్త్రీయంగా పరిశీలిస్తామని అధికారి తెలిపారు. అంతా బాగానే ఉంటే మూడు నెలల్లో వ్యర్థాలు బూడిదగా మారుతాయి. లేకపోతే, బర్నింగ్ వేగం తగ్గుతుంది. ఫలితంగా దీనికి తొమ్మిది నెలల సమయం పట్టవచ్చన్నారు.
సుమారు 1.75 లక్షల జనాభా ఉన్న పితాంపూర్‌కు ఈ వ్యర్థాలు చేరుతున్నాయనే వార్త తెలుసుకున్న స్థానికులు.. ఆదివారం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని తమ చేతులకు నల్ల బ్యాండ్‌లు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. "పితాంపూర్‌ను భోపాల్‌గా మార్చనివ్వం", "పితాంపూర్‌ను రక్షించండి, విష వ్యర్థాలను తొలగించండి" వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను పట్టుకుని నిరసన తెలిపారు. తాము కూడా తమ వాదనలను కోర్టులో సమర్పిస్తామన్నారు.
భోపాల్ దుర్ఘటన
భోపాల్ దుర్ఘటన జరిగి డిసెంబర్ 3, 2023 నాటికి 39ఏళ్లు పూర్తి చేసుకుంది. 1984. డిసెంబర్ 2 -3 తేదీల మధ్య జరిగిన ఈ ఘటనలో 15వేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగి 40ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆ ప్రాంతంలోని జనాలు ఈ విష వాయువు ప్రభావాలను ఎదుర్కొంటూనే ఉన్నారు.
Also Read : Pakistan Afghanistan War: తాలిబన్ల చేతిలో చావు దెబ్బ తింటున్న పాకిస్తాన్ - భారత్ పని సులువైనట్లే !