Fire Hits Zaporizhzhya Nuclear Plant: ఉక్రెయిన్‌కు చెందిన జపోరిజియా అణు విద్యుత్ కేంద్రంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మాస్కో దళాలే పేలుళ్లకు పాల్పడ్డాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఉక్రెయిన్‌ దళాలు ప్రయోగించిన ఫిరంగుల కారణంగానే మంటలు వ్యాపించాయని రష్యా కూడా ప్రత్యారోపణలు చేస్తోంది. కమికాజ్ డ్రోన్‌ను ఉపయోగించి ఉక్రెయిన్ ఈ దాడికి పాల్పడినట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. అయితే రెండేళ్లుగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్లాంట్ ఇంత దారుణంగా దెబ్బతినడం ఇదే తొలిసారి.


ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఈ ప్లాంట్ ఐరోపాలో అతిపెద్ద అణువిద్యుత్తు కేంద్రాల్లో ఒక‌టి. ఈ జపోరియా అణువిద్యుత్ కేంద్రంలో, అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు చెందిన సిబ్బంది కూడా ప‌నిచేస్తున్నారు. ప్ర‌స్తుతానికి ఎటువంటి రేడియేష‌న్ లీకేజీ లేద‌ని చెబుతున్నప్ప‌టికీ మంటలు వ్యాపించిన ప్రదేశానికి తమను వెళ్లనీయాలని ఉక్రెయిన్ కోరుతోంది.






2022 నుంచి ర‌ష్యా ఆధీనంలోనే...


కూలింగ్‌ టవర్‌లో ఆదివారం భారీగా మంటలు చెలరేగిన‌ట్లు అక్కడ విధులు నిర్వహిస్తున్న రష్యా నియమిత గవర్నర్‌ యూవ్‌గెవ్‌నీ బాలిటెస్కీ చెప్పారు. అయితే తమ దళాలు వాటిని సోమవారం నాటికి పూర్తిగా ఆర్పేశాయని ఆయ‌న వెల్లడించారు. రష్యా దళాలు 2022లో జపోరియా అణు విద్యుత్​ కేంద్రాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కాగా గ‌డిచిన రెండేళ్లుగా ఇక్కడ విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. రియాక్టర్లను ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కోల్డ్‌ షట్‌డౌన్‌లో ఉంచారు. తాజాగా ఈ ప్లాంట్‌ కూలింగ్‌ టవర్‌పై జరిగిన డ్రోన్‌ దాడిని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నిపుణులు ఎక్స్‌లో వెల్లడించారు.


గ‌డిచిన రెండేళ్లుగా ఉక్రెయిన్‌- ర‌ష్యా మ‌ధ్య యుద్ధం జ‌రుగుతోంది. ఉక్రెయిన్ తొలిసారి దాదాపు 15 కిలోమీటర్ల మేర రష్యా ప్రధాన భూభాగంలోకి చొచ్చుకెళ్లి దాడులు చేసింది. దీంతో రష్యాలోని సరిహద్దు ప్రాంతమైన కస్క్‌ నుంచి ఇప్పటికే అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు నాలుగు రోజులుగా ఇరు దేశాల మధ్య ఈ ప్రదేశంలో భీకర పోరు జ‌రుగుతోంది. 


ఉక్రెయిన్ డ్రోన్లను నేల‌కూల్చిన ర‌ష్యా


కస్క్‌ నుంచి ఉక్రెయిన్‌ బలగాలు ముందుకు దూసుకెళ్ల‌కుండా రష్యా బలగాలు నిరోధిస్తున్నాయని రష్యా రక్షణ శాఖ తెలిపింది. కస్క్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌కు చెందిన 26 డ్రోన్‌లను నేలకూల్చినట్లు వెల్ల‌డించింది. దీంతోపాటు ఉక్రెయిన్‌కు చెందిన కమాండ్ పోస్టు, సైనిక వాహనాలను కూడా ధ్వంసం చేసినట్లు రష్యా ప్ర‌క‌టించింది. 22వ మెకనైజ్డ్ బ్రిగేడ్‌కు చెందిన 15మంది కమాండర్లను చంపేందుకు ఇస్కందర్ క్షిపణలను సైతం ఉపయోగించినట్లు ర‌ష్యా వెల్లడించింది. కస్క్‌ వైపు ఉక్రెయిన్ 1120 మంది సైనికులు, యుద్ధ ట్యాంకులు సహా ఇతర కీలక యుద్ధ సామగ్రిని కోల్పోయిందని పేర్కొంది. ఇటు ఉక్రెయిన్ కూడా ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. కస్క్‌ ప్రాంతంలో తమ బలగాలు దాడులు చేస్తున్నాయని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మీడియాకు తెలిపారు. రష్యాకు చెందిన నేచుర‌ల్ గ్యాస్ క్షేత్రాన్ని, అనేక నౌకలను ధ్వంసం చేసినట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. 


Also Read: SEBI on Hindenburg Report: హిండెన్ బర్గ్ రిపోర్టుపై ఇన్వెస్టర్లు బీ అలర్ట్, చివరి దశలో అదానీ గ్రూపు దర్యాప్తు: సెబీ