Byra Dileep Is NDA Candidate For Visakha MLC By Elections : ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే వైసీపీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బరిలో ఉన్నారు. ఇప్పుడు ఎన్డీఏ తరఫున ఎవరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఖరారు అయింది. ఎన్నో చర్చలు తర్జనభర్జనల తర్వాత ఆయన పేరును కూటమి నేతలు ఖరారు చేశారు.
ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థలకు జరిగే ఈ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు మంగళవారంతో నామినేషన్ గడువు ముగుస్తోంది. ఆఖరి నిమిషం వరకు కూటమిలో ఈ సీటులో పోటీపై ఎడతెగని చర్చ జరిగింది. ఓ వైపు అభ్యర్థిని ముందుగానే ప్రకటించిన వైసీపీ గెలుపు లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. తమ పార్టీకి చెందిన ఓటర్లను ఇప్పటికే క్యాంపునకు తరిలించింది. ఆరు వందల మందికిపైగా తమ ఓటర్లు ఉన్నందున పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయమ విజయం ఖాయమని చెబుతోంది.
ఎవరు బరిలో నిలబడాలనే చర్చల్లో తలమునఖలైన ఎన్డీఏ అభ్యర్థిని ఖరారు చేయలేకపోయింది. ఒకానొక దశలో పోటీ నుంచి తప్పుకుంటుందా అన్న ఆలోచన కూడా చేసింది. దీనిపై ఊహాగానాలే తప్ప ఎలాంటి ప్రకటన చేయలేదు. మంగళవారంతో నామినేషన్ గడువు ముస్తున్నందున ఈ లోపు అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తిని బరిలో దింపింది.
ఈ పేరును కూడా అధికారికంగా ప్రకటన చేయలేదు. ఇంకా చాలా మంది రేసులో ఉన్నారని కూటమి పార్టీలు చెబుతున్నాయి. గండి బాబ్జీ, పీలా గోవింద్, బైరా దిలీప్ పేరు ప్రస్తుతానికి ఫైనల్ లిస్టులో ఉన్నాయని చెబుతున్నారు. అయితే అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు బైరా దిలీప్ పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. నామినేషన్ వేసేందుకు ఆయన సిద్ధమైనట్టు చెబుతున్నారు.
వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే తమ పార్టీ ఓట్లుగా చెప్పుకున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను వైసీపీ క్యాంపునకు తరలించింది. ఇంకా క్యాంపునకు వెళ్లని వాళ్లు చాలా మంది పార్టీ మారుతున్నారు. సర్పంచ్‌లు, ఎంపీపీలు కండువాలు మార్చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి నెలకొంది.
గెలిచే సంఖ్యా బలం లేకపోయినప్పటికీ టీడీపీ అధికార బలంతో గెలవాలని చూస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే విశాఖకు చెందిన ప్రజాప్రతినిధులతో దఫదఫాలుగా సమావేశమైన వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ పార్టీ అభ్యర్థని గెలిపించాలని కోరారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గొద్దని సూచించారు.