Weather Latest News: తెలుగు రాష్ట్రాలను మరోసారి వర్షాలు ముంచెత్తబోతున్నాయి. చురుగ్గా ఉన్న రుతుపవనాలకు తోడు శ్రీలంక పరిసరాల్లో ఏర్పడబోయే ద్రోణి కారణంగా నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే ఆదివారం సాయంత్రం నుంచి వానలు దంచి కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళ, మహారాష్ట్రలో కూడా కండపోతగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 


తేలిక పాటి వర్షాలు 


కొన్ని రోజులగా కాస్త గ్యాప్ ఇచ్చిన వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. ఇయితే ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజుల నుంచి ఏదో ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. తెలంగాణలో మాత్రం గత వారం రోజులుగా వర్షాలు కాస్త ఊరట ఇచ్చాయి. అయితే మరో నాలుగు రోజులు మళ్లీ వానలు పడబోతున్నాయని ఐఎండీ హెచ్చరించింది.కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిస్తే... మరికొన్ని ప్రదేశాల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు వివరించారు. 


16వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో వానలే 


నైరుతి రుతుపవనాలు,ఉపరితల ఆవర్తనం కలిసి తెలుగు రాష్ట్రాలను తడిసి ముద్దచేయనున్నాయి. తెలంగాణలో ఆదివారం ప్రారంభమైన వర్షాలు 16వ తేదీ వరకు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌లో 15వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. 


గత వారం రోజులుగా రుతుపవనాల్లో చురుకుదనం తగ్గడంతో వర్షాలు అడపాదడపా కురిశాయి. ప్రస్తుతానికి బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఎలాంటి ద్రోణులు లేని కారణంగా తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. 13వ తేదీ తర్వాత శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే సూచనలు ఉన్నందున రుతుపవనాలు యాక్టివేట్ అయ్యి వర్షాల జోరు పెరగనుంది. 


తెలంగాణ వెదర్ రిపోర్ట్


తెలంగాణలో చూసుకుంటే... తెలంగాణలో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, వరంగల్‌, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, భూపలల్లె జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇవాళ రేపు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 13వ తేదీ తర్వాత వాతావరణంలో మార్పు ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 


హైదారాబాద్‌  వెదర్‌ రిపోర్ట్


హైదరాబాద్‌లో అక్కడక్కడ వర్షాలు కరవనున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఐఎండీ తెలిపింది. అయితే రాత్రి నుంచి హైదరాబాద్‌లో జోరు వానలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో తుంపరలు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోయాయి. 


ఆంధ్రప్రదేశ్‌ వెదర్ రిపోర్ట్


ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇదే పరిస్థితి కనిపించనుంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో చెదురుమదురు జల్లులు పడతాయి. సాయంత్రానికి విశాఖలో వర్షాలు కురవనున్నాయి. విజయవాడ, కృష్ణా, గుంటూరు, పల్నాడులో రాత్రి సమయంలో వర్షాలు కురుస్తాయి. అది కూడా చాలా తక్కువ సమయం కురవనున్నాయి. 


గోదావరి జిల్లాలు, ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో కూడా చెదురుమదురు వర్షాలే పడతాయి. అది కూడా రాత్రివేళలోనే కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సీమ జిల్లాలైన తిరుపతి, చిత్తూరు, కడప దక్షిణ భాగాల్లో వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఈ వర్షాలు రెండు రోజుల తర్వాత నుంచి మరింతగా పెరిగే ఛాన్స ఉందంటున్నారు.