UK New Home Secretary: బ్రిటన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రధాని లిజ్ ట్రస్ సర్కార్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత సంతతికి చెందిన హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ (42) బుధవారం తన పదవికి రాజీనామా చేశారు.
ఇదే రీజన్
బ్రిటన్ హోం మంత్రిగా బ్రేవర్మన్ ఇటీవలే నియమితులయ్యారు. భారత సంతతికి చెందిన మరో మహిళ ప్రీతి పటేల్ స్థానంలో న్యాయవాది బ్రెవర్మాన్ ఆ బాధ్యతల్ని స్వీకరించారు. అయితే ఓ చిన్న తప్పిదం చేయడం వల్ల నైతికంగా బాధ్యత వహిస్తూ బ్రేవర్మాన్ తన పదవికి రాజీనామా చేశారు.
శాఖాపరమైన కమ్యూనికేషన్ కోసం ఆమె పొరపాటున తన వ్యక్తిగత ఈ-మెయిల్‌ను ఉపయోగించారు. సహచర పార్లమెంటేరియన్‌కు తన వ్యక్తిగత మెయిల్ నుంచి సమాచారం అందించారు. అనంతరం ప్రధాని ట్రస్‌తో బుధవారం భేటీ అయిన తర్వాత బ్రేవర్మన్ తన రాజీనామా ప్రకటన చేశారు.
ఆ స్థానంలో
ఆమె హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టి 43 రోజులే అయింది. ఆమె స్థానంలో మాజీ రవాణా మంత్రి గ్రాంట్ షాప్స్‌ని నియమించినట్లు ట్రస్ కార్యాలయం తెలిపింది.
మినీ బడ్జెట్‌లో చేసిన పన్ను కోత ప్రతిపాదనలపై దుమారం చెలరేగడంతో ఇటీవలే క్వాసీ క్వార్టెంగ్‌ను ఆర్థిక మంత్రి పదవి నుంచి ట్రస్ తప్పించారు.
క్షమాపణలు
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ ఆ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పన్నుల భారం తగ్గించడం వల్ల దేశం ఆర్థిక సంక్షోభంలో పడిపోయిందని ఆమె అన్నారు. పన్నుల భారం తగ్గించడంపై యూటర్న్ తీసుకున్నందుకు ఆమె దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
కొంపముంచింది
లిజ్ ట్రస్ ఇప్పటికే ఓ మినీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అది కాస్తా...దేశ ఆర్థిక వ్యవస్థను ఇంకాస్త కుంగదీసింది. ధనికులకు పన్నుకోతలు విధించటం పెద్ద ఎత్తున ఆందోళనలకు దారి తీసింది. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా ఉన్న క్వాసీ కార్టెంగ్‌ను ఆ పదవి నుంచి తప్పించారు లిజ్ ట్రస్. ఈ నిర్ణయంతో ఇంకా వ్యతిరేకత పెరిగింది. ట్రస్ అధికారంలోకి వచ్చినప్పటికీ...ప్రస్తుతం అందరి పార్టీ సభ్యుల అభిప్రాయం మారిపోయింది. "తప్పుడు అభ్యర్థిని ఎంచుకున్నాం" అని వాళ్లు బహిరంగంగా చెప్పకపోయినా...వాళ్ల ఆలోచన అలాగే ఉందని ఓ సర్వేలో తేలింది. దాదాపు 62% మంది ఈ అసహనంతోనే ఉన్నారట. లిజ్ ట్రస్‌ను పక్కన పెట్టి మళ్లీ రిషి సునక్‌ను తెరపైకి తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: Bengaluru IMD Alert: మరోసారి బెంగళూరుని ముంచెత్తుతున్న వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ