Bengaluru IMD Alert:
రోడ్లన్నీ జలమయం..
బెంగళూరుని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈస్ట్, సౌత్, సెంట్రల్ బెంగళూరులోని రోడ్లు జలమయం అయ్యాయి. బెల్లందూర్‌లోని ఐటీ సిటీ కూడా తీవ్రంగా ప్రభావితమైంది. వాతావరణ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం...సిటీకి నార్త్‌లో ఉన్న రాజ్‌మహల్ గుత్తహళ్లిలో రికార్డ్ స్థాయిలో 59మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో మూడు రోజుల వరకూ ఇలాగే వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బెంగళూరుకి "Yellow Alert"జారీ చేసింది వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మ్యాన్‌హోల్స్ నుంచి మురుగునీరు పొర్లి పొంగుతున్నాయి. పలు అపార్ట్‌మెంట్‌ల సెల్లార్లు పూర్తిగా జలమయం అయ్యాయి. నీళ్లలో మునిగిపోవటం వల్ల వాహనాలు పాడైపోతున్నాయి. ఆఫీస్‌ల నుంచి ఇంటికి వచ్చే వారంతా..తడవకుండా ఉండేందుకు మెట్రోల కింద నిలబడుతున్నారు. రోడ్లపై ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. వర్షాల ధాటికి మజెస్టిక్‌లో ఓ గోడ కూలిపోయింది. పక్కనే పార్క్ చేసి ఉన్న నాలుగు కార్లపై గోడ కూలటం వల్ల అవి ధ్వంసమయ్యాయి.
గత నెలలోనూ వర్షాలు..
సెప్టెంబర్‌లోనూ బెంగళూరుని వరుణ గండం వదల్లేదు. దాదాపు 10 రోజుల పాటు అక్కడి ప్రజలు నరక యాతన అనుభవించారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఇళ్లు నీట మునిగాయి. సహాయక చర్యలు అందితే తప్ప ఒక్క రోజు కూడా అక్కడ గడపలేని దుస్థితి వచ్చింది. .అప్పటి వరదలు బెంగళూరులోని బిలియనీర్లనూ ఇబ్బంది పెట్టాయి. రిచెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అయిన Epsilonనూ వరద చుట్టుముట్టింది.
ఎంతో మంది ధనికులు ఈ కమ్యూనిటీలోనే ఉంటారు. విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ, బ్రిటానియా సీఈవో వరుణ్ బెర్రీ, బిగ్‌బాస్కెట్ కో ఫౌండర్ అభినయ్ చౌదరి, బైజూస్ కో ఫౌండర్ బైజు రవీంద్రన్..ఇలా ఎందరో. వీళ్లందరూ తమ ఇళ్లలోనే ఉండలేని పరిస్థతి వచ్చింది. ఇళ్లన్నీ జలమయమయ్యాయి. ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఒక్కో విల్లా విలువ రూ.10 కోట్లు. ఇంత కాస్ట్‌లీ భవంతులూ వరద తాకిడికి తడిసి ముద్దైపోయాయి. సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. లగ్జరీ కార్లు నీటిలో మునిగిపోయాయి. సిటీలోని ఐటీ హబ్ కూడా గత నెల వరదలకు తీవ్రంగా ప్రభావితమైంది. కంపెనీలన్నీ నీటిలో మునిగిపోయాయి. ఆ పరిసరాల్లోని రహదారులు జలమయ మయ్యాయి. వాహనాలు తిరిగే పరిస్థితే లేదు.
ఆక్రమణలే కారణం..?
ఈ వరదలకు కారణం...ఆక్రమణలే అని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఆక్రమణలు చేసిన వాళ్లలో బడా టెక్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ ఆక్రమణల ఫలితంగా...దాదాపు 780 వర్షపు నీటి కాలువలు మూసుకుపోయాయి. ఫలితంగానే...ఈ స్థాయిలో వరదలు వచ్చినట్టు అధికారులు నిర్ధరించారు. ఈ టెక్ కంపెనీల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. విప్రో, ప్రెస్టేజ్, ఈకో స్పేస్, బాగ్‌మనే టెక్ పార్క్, కొలంబియా ఆసియా హాస్పిటల్, దివ్యశ్రీ విల్లాస్ ఈ జాబితాలో ఉన్నాయి. బడా వ్యక్తులైనప్పటికీ...చర్యలు తప్పకుండా తీసుకుంటామని చాలా స్పష్టంగా చెబుతున్నారు అధికారులు. ఈస్ట్ బెంగళూరులో ఇప్పటికే అక్రమంగా నిర్మాణాలను కూల్చివేసే పని మొదలైంది. నాలాపడ్‌లోని కాంగ్రెస్ నేతకు చెందిన ఓ స్కూల్‌ని కూడా కూల్చివేశారు.
Also Read: Delhi Air Quality Index: హోటల్స్‌లో బొగ్గు వాడొద్దు, డీజిల్ జనరేటర్లపైనా నిషేధం - ఢిల్లీలో ఆంక్షలు