Delhi Air Quality Index:


దారుణంగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ..


అక్టోబర్‌ రాగానే...ఢిల్లీలో కాలుష్య కష్టాలు మొదలవుతుంటాయి. ఈ సారి ఈ సమస్య మరీ తీవ్రంగా కనిపిస్తోంది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ నగరంలో వాయు నాణ్యత దారుణంగా పడిపోయినట్టు వెల్లడించింది. ఎయిర్ క్వాలిటీని "Very Poor"గా నిర్ధరించింది. Graded Response Action Plan (GRAP) అంచనా ప్రకారం..శనివారం నాటికి పరిస్థితులు మరీ దిగజారతాయని తెలిపింది. కాలుష్య తీవ్రతను స్టేజ్-2గా ప్రకటించింది. ఇందులో భాగంగా...కాలుష్య కట్టడికి కొన్ని చర్యలు చేపడతారు. రెస్టారెంట్‌, హోటల్స్‌లో బొగ్గు, కట్టెలు కాల్చడంపై నిషేధం విధిస్తారు. అత్యవసర సేవల్లో తప్ప మిగతా ఎక్కడా డీజిల్ జనరేటర్లు వినియోగించడానికి వీలుండదు. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రిం చేందుకు GRAPని ఇటీవలే తీసుకొచ్చింది ప్రభుత్వం. వాతావరణ పరిస్థితుల్ని బట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలే ఈ ప్లాన్‌ సూచిస్తుంది.మొత్తం నాలుగు స్టేజ్‌లుగా తీవ్రతను విభజించి ఆ స్టేజ్‌కు తగ్గట్టుగా తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది. అక్టోబర్ 22 నుంచి వాయునాణ్యత "Very Poor"గానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 24న దీపావళి వేళ కాలుష్యం ఇంకా తీవ్రమయ్యే ముప్పు ఉంది. 


బాణసంచా కాల్చొద్దు..


ఈ క్రమంలోనే ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటోంది. దీపాళికి బాణసంచా కాల్చితే నేరుగా జైలుకు పంపుతామంటున్నారు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్. రూ.200 జరిమానాతో పాటు ఆర్నెల్ల పాటు జైలు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన..ఢిల్లీలో బాణసంచా తయారీ, నిల్వ, విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఎవరు ఈ నిబంధనలు ఉల్లంఘించినా రూ.5000 జరిమానాతో పాటు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తామని వెల్లడించారు. అక్టోబర్ 21న ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించనుంది ప్రభుత్వం. "బాంబులు పక్కన పెట్టి దీపాలు వెలిగించండి" అనే నినాదంతో ప్రచారం చేయనున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే శుక్రవారం ఢిల్లీలోని కన్నాట్‌లో సెంట్రల్ పార్క్‌లో 51,000 దీపాలు వెలిగించనున్నారు. బాణసంచాపై నిషేధాన్ని అమలు చేసేందుకు 408 బృందాలు సిద్ధంగా ఉన్నాయని గోపాల్ రాయ్ తెలిపారు. ఏసీపీ కింద 210 బృందాలు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ కింద 165 బృందాలు, ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ కింద 33 బృందాలు ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయనున్నాయి. 


స్టేజ్‌ల ఆధారంగా చర్యలు..


వాయు నాణ్యత ఆధారంగా స్టేజ్‌లను నిర్ధరిస్తారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 201-300 మధ్యలో ఉంటే స్టేజ్‌ 1గా, 301-400గా ఇంటే స్టేజ్‌2గా పరిగణిస్తారు. 401-450 వరకూ స్టేజ్‌-3 కాగా, 450 కి మించి AQI ఉంటే అత్యంత ప్రమాదకమైన స్టేజ్‌ 4గా నిర్ధరిస్తారు. బొగ్గుతో పాటు, రెస్టారెంట్‌లు, హోటల్‌లో తందూర్స్‌నూ వినియోగించేందుకు వీల్లేకుండా ఆంక్షలు విధిస్తారు. డీజిల్ జనరేటర్ సెట్స్‌ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. స్టేజ్‌ 3 వరకూ తీవ్రత చేరుకుంటే,  వెంటనే ఎన్‌సీఆర్, దిల్లీ పరిధిలోని నిర్మాణాలను ఆపేస్తారు. అత్యవసర ప్రాజెక్ట్‌లు తప్ప మిగతా అన్ని నిర్మాణాలపైనా ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ప్లంబింగ్, కార్పెంటరీ, ఇంటీరియర్ డెకరేషన్ లాంటివి మాత్రం చేసుకోవచ్చు. స్టోన్ క్రషర్స్, ఇటుక బట్టీలపైనా నిషేధం విధిస్తారు. అంతే కాదు. బీఎస్-3, బీఎస్-4  వాహనాలూ రోడ్డుపైకి రాకుండా ఆంక్షలు విధిస్తారు. ఇక స్టేజ్‌ 4లో ట్రక్స్, గూడ్స్ వాహనాలు తిరగకుండా నిషేధిస్తారు. 


Also Read: మర్యాద ఇచ్చుకో రాయితీ పుచ్చుకో, ఆ రెస్టారెంట్‌లో అదిరిపోయే ఆఫర్