ఈ మధ్య కొన్ని పనులు నెట్టింట చాలా వైరల్ అవుతున్నాయి. కొన్ని వైరల్ వార్తల వల్ల మంచి మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వాటిల్లో ఇప్పుడు చెప్పబోయే వార్త కూడా ఒకటి. 


హోటల్ అంటే.. రకరకాల వ్యక్తులు వచ్చిపోతుంటారు. కొందరు మర్యాదగా బిహేవ్ చేస్తే మరికొందరు.. రఫ్ అండ్ టఫ్‌గా ఉంటారు. దురుసుగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెట్టేవారు కూడా లేకపోలేదు. ముఖ్యంగా బిల్లుల విషయంలో తేడా వస్తే.. కోపం కట్టలు తెంచుకుంటుంది. అలాంటి సమయంలో మర్యాదగా వ్యవహరించడం అంటే ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే, ఆ రెస్టారెంట్ ప్రకటించిన ఆఫర్ తెలిసిన తర్వాత.. మర్యాదగా ఉండటానికే కస్టమర్లు ఎక్కువ ఇష్టపడతారు.


దురుసుగా ప్రవర్తించే కస్టమర్లలో మార్పు తెచ్చేందుకు ఓ రెస్టారెంట్ యజమానికి కత్తిలాంటి ఐడియా వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆ యజమాని ఐడియా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. యూకేలోని ప్రీస్టన్‌లో ఉస్మాన్ హుస్సేన్ అనే వ్యక్తి  ‘చాయ్ షాప్’ అనే వివిధ రకాల చాయ్ లు, స్నాక్స్ కు సంబంధించిన ఓ రెస్టారెంట్‌ను మార్చి నెలలో  ప్రారంభించాడు. దీనిలో టీ, డోనట్లు, స్ట్రీట్ ఫుడ్స్, డిసర్టులు, బిస్కట్లులాంటి పదార్థాలన్నీ దొరుకుతాయి. అయితే, వాటి ధర కస్టమర్లు ఇచ్చే మర్యాద మీద ఆధారపడి ఉంటుంది. మర్యాద ఇవ్వని కస్టమర్లకు ఎలాంటి ఆఫర్ ఉండదు. మర్యాద ఇస్తే మంచి రాయితీ లభిస్తుంది. 


ఈ విషయాన్ని ఆయన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నాడు. ‘‘మా రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్లు, సిబ్బందితో పొలైట్‌గా వ్యవహరిస్తే.. వారి బిల్లులో తగ్గింపు ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. రెస్టారెంట్ బయట ఉండే బోర్డుపై కూడా ఇదే విషయాన్ని ప్రకటించానని తెలిపాడు. ఈ రెస్టారెంట్‌ లో టీ తాగాలని అనుకునే వాళ్లు.. ‘దేశీ చాయ్’ అని అడిగితే 5 యూరోలు (రూ.400) చెల్లించాల్సి ఉంటుందనీ, అదే ‘దేశీ చాయ్ ప్లీజ్’ అని అడిగితే కేవలం 3 యూరోలకే (రూ.240) ఇస్తాం అనీ పేర్కొన్నాడు. 


ఇక ఇంకాస్త మర్యాదగా ‘హలో.. దేశీ చాయ్ ప్లీజ్’ అని ఆర్డర్ ఇస్తే టీ రేటు 1.9 యూరోలే (రూ.152) చార్జ్ చేస్తాం అని రెస్టారెంట్ ముందు పెట్టిన బోర్డులో ఉస్మాన్ పేర్కొన్నాడు. అయితే ఇప్పటివరకు ఏ కస్టమర్ కూడా దురుసుగా ప్రవర్థించలేదని చెప్పాడు. ఇప్పుడు ఈ విషయం నెట్టింట తెగ వైరల్ కావడంతో అందరూ అతని ఆలోచనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బిల్లులో రాయితీ సంగతి పక్కనబెడితే కనీసం సిబ్బందితో ఎలా నడుచుకోవాలో దురుసుగా ప్రవర్తించే వారికి అర్థమవుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు.