Fact Check : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ మాత్రమే వెళ్లారని అంటున్నారు. బీజేపీతో సరిగ్గా కలిసి పని చేయలేకపోతున్నామని .. అందుకే వ్యూహం మార్చుకుంటున్నామని పవన్ కల్యాణ్ ప్రకటించిన తరవాత బీజేపీలో అలజడి ప్రారంభమయింది. పలువురు నేతలు ఈ అంశాన్ని బీజేపీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. అందుకే వెంటనే బిజేపీ పెద్దలు పవన్ కల్యాణ్‌తో టచ్‌లోకి వచ్చారని.. ఢిల్లీకి వస్తే మాట్లాడుకుందామని పిలిచారని చెప్పుకున్నారు. ప్రత్యేక విమానం కూడా పంపినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ అదంతా అబద్దమని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
చంద్రబాబుతో భేటీ తర్వాత బీజేపీ హైకమాండ్ పవన్‌ను పిలిచినట్లుగా ప్రచారం
విశాఖలో జరిగిన ఘటనలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని పవన్ కల్యాణ్ అనుకున్నారు. కానీ రాజ్ భవన్ నుంచి పవన్‌కు అపాయింట్మెంట్ విషయంలో ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే పవన్ విజయవాడ పర్యటనలో ఈ సారి సంచలనాత్మక మార్పులు వచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడంతో.. కీలకమైన మార్పులు వచ్చాయి. ఈ పరిణామాలతో అనేక రకాలైన ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. అందులో భాగంగానే.. పవన్ ను.. బీజేపీ హైకమాండ్ పిలిచిందని చెప్పుకున్నారని.. నిజంగా ఆయనకు బీజేపీ పెద్దల వైపు నుంచి ఎలాంటి పిలుపు రాలేదని చెబుతున్నారు. అలాగే పవన్ కూడా ఢిల్లీ వెళ్లలేదంటున్నారు.
పవన్ దూరం కావడానికి సోము వీర్రాజే కారణమని విమర్శలు
మరో వైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తూండటంతో ఆ పార్టీలో అంతర్గత రాజకీయాలు వెలుగులోకి వస్తున్నాయి. పవన్‌కల్యాణ్‌తో పొత్తు విషయంలో బీజేపీలో అంతర్గత చర్చ జరుగుతోంది. బీజేపీతో కలిసి నడిచేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమై.. పొత్తు ప్రకటించినప్పటికీ ఆ పార్టీతో బీజేపీ కలిసి పని చేయలేకపోయింది. మొదట్లో సమన్వయకమిటీని ఏర్పాటు చేసుకుని ఆ మేరకు ఉమ్మడి పోరాటాలు చేయాలనుకున్నారు. కానీ ఎప్పుడూ అలాంటి ప్రయత్నం జరగలేదు. చివరికి తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల సమయంలో పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థి అని సోము వీర్రాజు ప్రకటించారు.
ఏపీ బీజేపీలో పవన్ దూరం కావడంపై ప్రకంపనలు
కానీ ఇటీవల జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్ పర్యటన సమయంలో మాత్రం మాట మార్చారు. తమది జాతీయ పార్టీ అని ఇతర పార్టీల నేతలను ఎందుకు సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని కొంత మంది నేతలు ప్రకటించారు. దీంతో జనసేనతో గ్యాప్ పెరిగింది.ఈ పరిస్థితులన్నింటికీ కారణం సోము వీర్రాజేనని.. మరో సీనియర్ నేత కన్నా లక్ష్మినారాయణ ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు.