BJP Kanna : భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో చేసిన ప్రకటన కలకలం రేపింది. పవన్ కల్యాణ్ బీజేపీకి దూరమవడం వెనుక సోము వీర్రాజు ఏకపక్ష వైఖరే కారణం అని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. కొన్నాళ్లుగా పార్టీ వ్యవహారాలపై ఆయనకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో బీజేపీలో ఉండటం కన్నా ఏదో ఓ పార్టీలో చేరడమే మంచిదని ఆయన అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సోము వీర్రాజు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత తన రాజకీయ అనుచరులతో ఆయన సమావేశం కానున్నారు. అందులో తన రాజకీయ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం కష్టం. కన్నా లక్ష్మినారాయణకు వ్యక్తిగత ఇమేజ్ ఉన్నప్పటికీ పార్టీ పరమైన ఆదరణ లేకపోతే గెలుపొందడం కష్టం. గతంలో గుంటూరు పశ్చిమ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో బీజేపీ తరపున నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టసభల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. అందుకే ఆయన తన రాజకీయ అడుగులు వేగంగా వేస్తున్నారని అంటున్నారు. కన్నా లక్ష్మినారాయణ బీజేపీకి గుడ్ బై చెబితే ఏ పార్టీలో చేరుతారన్న అంశంపై విస్తృతమైన చర్చ జరుగుతోంది.
నిజానికి కన్నా లక్ష్మినారాయణ గత ఎన్నికలకు ముందే వైఎస్ఆర్‌సీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. పాదయాత్రలో ఉన్న జగన్ వద్దకు వెళ్లి కండువా కప్పించుకునేందుకు సిద్ధమయ్యారు. ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ చివరి క్షణంలో అమిత్ షా నుంచి ఫోన్ రావడంతో అనారోగ్యం పేరుతో ఆస్పత్రిలో చేరిపోయారు. ఆయన వైసీపీలో చేరడం కాన్సిల్ అయింది. ఆ తర్వాత ఆయనకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాల్సి రావడంతో ఆయనతో సహా అందరూ పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని కూడా కోల్పోయారు. అప్పట్నుంచి బీజేపీలో ప్రాధాన్యం లేకుండా పోయింది.
ఇప్పుడు పార్టీ మారాలనుకుంటే ఆయన మళ్లీ వైఎస్ఆర్‌సీపీ వైపు చూస్తారా లేక మరో ప్రత్యామ్నాయ పార్టీ వైపు అడుగులు వేస్తారా అన్నదానిపై స్పష్టత లేదు. తాను ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు వైఎస్ఆర్‌సీపీపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఈ కారణంగా ఆయన వైఎస్ఆర్‌సీపీ వైపు చూడకపోవచ్చని చెబుతున్నారు. మరో వైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో ఆయనకు ఎప్పట్నుంచో రాజకీయ వైరం ఉంది. వైఎస్ హయాం నుంచి చంద్రబాబుపై ఘాటుగా విరుచుకుపడేవారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో కన్నా సాఫ్ట్ గానే ఉంటారు. అయితే ఆ పార్టీలో చేరుతారా లేదా అన్నదానిపై స్పష్త లేదు. కన్నా బీజేపీపై అసంతృప్తిగా ఉన్నారు... అనుచరులతో సమావేశం అవుతున్నారు. కానీ పార్టీ మారుతారా లేదా అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు.