Kanna Vs Somu : జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తూండటంతో ఆ పార్టీలో అంతర్గత రాజకీయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై కన్నా లక్ష్మినారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు పార్టీలో ఏం జరుగుతుందో తనకేమీ తెలియడం లేదన్నారు. సోము వీర్రాజు ఏకపక్షంగా వ్యవహరించడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని... మా పార్టీలో ఏం జరుగుతుందో మాకు తెలియడం లేదని అసహనం వ్యక్తం చేశారు. పవన్ తో సోము వీర్రాజు సమన్వయం చేసుకోలేకపోయారన్నారు. సోము వీర్రాజు ఒక్కడే అన్నీ చూసుకోవడం వల్లే సమస్య వచ్చిందన్నారు. హైకమాండ్ తక్షణం జోక్యం చేసుకుని ఏపీలో బీజేపీ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరారు.ఏపీలో ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో అన్ని పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలన్నారు.
సోము వీర్రాజే వన్ మ్యాన్ ఆర్మీలా వ్యవహరించారన్న అసంతృప్తి
సోము వీర్రాజు ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టక ముందు కన్నా లక్ష్మినారాయణనే బాధ్యతలు నిర్వహించేవారు. కరోనా సమయంలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పోరాటం చేశారు. అయితే హఠాత్తుగా బీజేపీ హైకమాండ్ ఆయనను మార్చి సోము వీర్రాజుకు పదవి అప్పగించింది. దీంతో కన్నా లక్ష్మినారాయణ సైలెంట్ అయిపోయారు. ఏపీ బీజేపీ కార్యక్రమాల్లోనూ పెద్దగా కనిపించడం లేదు. అయితే ఆయనకు జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించారు. కానీ రాష్ట్ర బీజేపీలో ఆయన పాత్రను పరిమితం చేశారు. ఎప్పుడైనా సమావేశాలు ఉంటే తప్ప..బయట కనిపించడం లేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ బీజేపీకి దూరమైనట్లుగా కనిపిస్తూండటంతో ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పవన్ తో సరిగ్గా వ్యవహరించని తప్పు..సోము వీర్రాజుదేనని చెప్పకనే చెబుతున్నారు.
పవన్ దూరం అయ్యేలా ఉండటానికి సోము వీర్రాజే కారణమా ?
పవన్‌కల్యాణ్‌తో పొత్తు విషయంలో బీజేపీలో అంతర్గత చర్చ జరుగుతోంది. బీజేపీతో కలిసి నడిచేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమై.. పొత్తు ప్రకటించినప్పటికీ ఆ పార్టీతో బీజేపీ కలిసి పని చేయలేకపోయింది. మొదట్లో సమన్వయకమిటీని ఏర్పాటు చేసుకుని ఆ మేరకు ఉమ్మడి పోరాటాలు చేయాలనుకున్నారు. కానీ ఎప్పుడూ అలాంటి ప్రయత్నం జరగలేదు. చివరికి తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల సమయంలో పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థి అని సోము వీర్రాజు ప్రకటించారు. కానీ ఇటీవల జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్ పర్యటన సమయంలో మాత్రం మాట మార్చారు. తమది జాతీయ పార్టీ అని ఇతర పార్టీల నేతలను ఎందుకు సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని కొంత మంది నేతలు ప్రకటించారు. దీంతో జనసేనతో గ్యాప్ పెరిగింది.
జనసేనను కలుపుకోని రాష్ట్ర బీజేపీ నేతలు
అదే సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వంపై పోరాటం విషయంలో జనసేన పార్టీని కలుపుకుని వెళ్లేందుకు బీజేపీ నేతలు పెద్దగా ఆసక్తి చూపలేదు. వైఎస్ఆర్‌సీపీపై పోరాటానికి రూట్ మ్యాప్ అడిగానని ఇవ్వలేదని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు రాష్ట్ర నాయకుల్ని అసలు తాను కలిసిందే లేదని.. ఢిల్లీ బీజేపీ నేతలతో మాత్రమే తనకు పరిచయం ఉందన్నారు. ఈ పరిణామాలన్నీ ..బీజేపీలో చర్చకు కారణం అయ్యాయి.