Liz Truss Phone Hacked: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ (Vladimir Putin)పై 'డెయిలీ మెయిల్' సంచలన కథనం ప్రచురించింది. యూకే మాజీ ప్రధాని లిజ్ ట్రస్ (Liz Truss) వ్యక్తిగత ఫోన్‌ను పుతిన్ కోసం పనిచేసే ఏజెంట్లు హ్యాక్ చేశారని ఈ కథనం పేర్కొంది. ఇంతకీ ఎందుకు హ్యాక్ చేశారు?


రహస్యాలు


లిజ్ ట్రస్.. బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆమె వ్యక్తిగత ఫోన్‌ను హ్యాక్ చేసినట్లు సమాచారం. దీని ద్వారా బ్రిటన్ మిత్ర దేశాలతో చర్చలకు సంబంధించిన కీలక రహస్యాలు రష్యాకు చేరినట్లు ఆ కథనం పేర్కొంది. అంతేకాకుండా లిజ్‌ ట్రస్‌కు అత్యంత సన్నిహితుడైన క్వాసీ క్వార్టెంగ్‌కు పంపించిన పలు వ్యక్తిగత సందేశాలు కూడా వారికి తెలిసినట్లు వెల్లడించింది. క్వార్టెంగ్‌ ఆ తర్వాత బ్రిటన్‌ ఆర్థిక మంత్రి అయ్యారు. 


ఉక్రెయిన్ సంగతులు


ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం భీకరంగా సాగుతోన్న వేళ లిజ్ ట్రస్.. బ్రిటన్ మిత్ర దేశాల విదేశాంగ మంత్రులతో జరిపిన సంభాషణలు పుతిన్‌కు చేరాయట. ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి పలువురు విదేశాంగ మంత్రులతో ట్రస్‌ సంభాషణలు జరిపారు. ఆయుధ సరఫరా రహస్యాలు కూడా పుతిన్‌ చేతికి వెళ్లినట్లు భావిస్తున్నారు.


ఒక ఏడాది మొత్తం ట్రస్‌ సంభాషణలు, సందేశాలు పుతిన్‌ ఏజెంట్లకు దక్కినట్లు అనుమానిస్తున్నారు. ప్రధాని పదవికి ట్రస్‌ పోటీ చేస్తున్నసమయంలో ఈ హ్యాక్‌ను గుర్తించారట.


45 రోజులు


బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 45 రోజులకే ఆ పదవికి రాజీనామా చేశారు లిజ్ ట్రస్. రాజకీయ సంక్షోభానికి తెర దించుతారని భావిస్తే...ఆమె వచ్చాక కూడా అదే అనిశ్చితి కొనసాగింది. సంపన్నుల పన్ను కోత విషయంలో ఆమె మాట తప్పడం, మినీ బడ్జెట్‌ విషయంలో విమర్శలు రావటం లాంటి పరిణామాలు ఆమెకు రాజీనామా తప్ప వేరే ఆప్షన్ లేకుండా చేశాయి. అత్యంత తక్కువ కాలం పాటు పదవిలో ఉన్న ప్రధానిగానూ ఆమె చరిత్రలో నిలిచిపోయారు. ఇంత తొందరగా...ఆమె పదవి నుంచి దిగిపోవటానికి ఎన్నో కారణాలున్నాయి.


లిజ్ ట్రస్‌ చేసిన ప్రధాన తప్పిదం "సంపన్నులకు పన్ను తగ్గించటం". ఇందుకోసం 45 బిలియన్ డాలర్ల ప్యాకేజ్ ప్రకటించారు. అప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతం అవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను ఇది ఇంకాస్త గండి కొట్టింది. ఎలాంటి ఆలోచన చేయకుండా...నిర్ణయం తీసేసు కున్నారు ట్రస్. ఫలితంగా...మార్కెట్‌లో పెద్ద కలకలం రేగింది. తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఫలితంగా...ఆమె ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. 


అనాలోచితంగా పన్ను కోత విధించటం వల్ల ఉన్నట్టుండి పౌండ్ విలువ పడిపోయింది. డాలర్‌తో పోల్చి చూస్తే...ఎన్నడూ లేనంతగా విలువ తగ్గిపోయింది. వెంటనే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ స్పందించి అప్రమత్తం చేసింది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలక ముందే మేలుకోవాలని హెచ్చరించింది. 


Also Read: Viral News: 4 ఇంజిన్లు, 100 బోగీలు- ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలును చూశారా?