Telangana withdraw nod to CBI for probe in state: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు అనుమతిని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సీబీఐ విచారణలు రాష్ట్రంలో కొనసాగకుండా జీవో 51ను విడుదల చేసింది. దాంతో గతంలో సీబీఐ దర్యాప్తునకు ఇచ్చిన అనుమతిని తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు అయింది. తాజా ఉత్తర్వులతో ఇక రాష్ట్రంలో ఏదైనా కేసులో దర్యాప్తు చేపట్టాలంటే కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఈ విషయాలను జీవో 51 లో పేర్కొంది.


టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనం రేపడంతో సీబీఐ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని ఉపసంహరించుకుంటూ సీఎం కేసీఆర్ ( Telangana CM KCR ) కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలల కిందట తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా అమలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక వైసీపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.


బిహార్ పర్యటనలోనే కేసీఆర్ నిర్ణయం వెల్లడి..
సీబీఐ దర్యాప్తు కోసం ఇచ్చిన అనుమతులను అన్ని రాష్ట్రాలు ఉపసంహరించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రెండు నెలల కిందట పిలుపునిచ్చారు. ఆగస్టు నెలాఖరులో బిహార్ లో పర్యటించారు కేసీఆర్. బిహార్ సీఎం నితీష్ కుమార్‌తో కలిసి పాట్నాలో విలేకరుల సమావేశంలో ప్రసంగించిన కేసీఆర్.. కేంద్ర సంస్థలను బీజేపీ తన స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగిస్తుందన్నారు. సీబీఐ, ఈడీ లాంటి విచారణ చేపట్టే ఏజెన్సీలను తమ రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.


కేంద్ర దర్యాప్తు సంస్థలకు అనుమతి ఉపసంహరించుకుంటున్న రాష్ట్రాలు.. 
పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ సహా తొమ్మిది రాష్ట్రాలు తమ పరిధిలోని కేసులను సీబీఐ విచారించేందుకు ఇప్పటికే దర్యాప్తు సంస్థలకు సాధారణ అనుమతిని ఉపసంహరించుకున్నాయి. తాజాగా ఈ జాబితాలో తెలంగాణ వచ్చి చేరింది. కేంద్ర ప్రభుత్వం సీబీఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేసేందుకు, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తుందని, బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర దర్యాప్తు సంస్థలకు సాధారణ సమ్మతిని ఉపసంహరించుకోవాలని ఆగస్టులో బిహార్ పర్యటన సందర్భంగా కేసీఆర్ మిగతా రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. కేంద్రం విషయంలో అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే స్థానిక పార్టీల పాలనను తెర దించేందుకు కుట్రలు జరుగుతాయని సీఎం కేసీఆర్ కొన్ని రోజుల కిందట ఆరోపించారు.


అనుమతి తీసుకుంటేనే దర్యాప్తు చేసే అవకాశం 
ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డిఎస్‌పిఇ) చట్టం, 1946లోని సెక్షన్ 6 ప్రకారం, ఆయా రాష్ట్రాల్లో దర్యాప్తు చేయడానికి సీబీఐకి ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటే, కేసు నమోదు చేయడానికి, దర్యాప్తు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి దర్యాప్తు సంస్థలు అనుమతి పొందాలి.