UK Cost Of Living Crisis:
10%కి మించిన ద్రవ్యోల్బణం..
యూకేలో ఎన్నడూ లేని ఆర్థిక సంక్షోభం నెలకొంది. ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతోంది. ఏది కొనాలన్నా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. చేసేదేమీ లేక లక్షలాది మంది ప్రజలు..భోజనం మానేస్తున్నారట. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవటం వల్ల ఆ ఖర్చులు భరించలేక ఆకలితోనే కాలం గడిపేస్తున్నారు. ఓ కన్జ్యూమర్ గ్రూప్ ఈ విషయం వెల్లడించింది. రానున్న రోజుల్లో చమురుకి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని అంచనా వేసింది. ప్రస్తుతం యూకేలో ద్రవ్యోల్బణం 10%కి మించి పరుగులు పెడుతోంది. సెప్టెంబర్ నాటికే పరిస్థితులు దిగజారాయి. ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. ఇటీవలే లిజ్ ట్రస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేస్తామని హామీ ఇచ్చారు. అయినా...ఆ దిశగా అడుగులు పడటం లేదు. అటు రాజకీయంగానూ ఇప్పటికే లుకలుకలు మొదలయ్యాయి. యూకేలోని సగానికిపైగా కుటుంబాల్లో రోజువారీ మీల్స్‌ని చాలా వరకు తగ్గించేశారు. 3 వేల మందిపై సర్వే చేయగా...ఈ విషయం వెల్లడైంది. దాదాపు 80% మంది ఆరోగ్యకరమైన ఆహారానికి దూరమయ్యారు. ఇదే సమస్య అనుకుంటే...ఇంతకు మించి మరోటి వారిని వేధిస్తోంది. ఇటీవలే యూకే ప్రభుత్వం... ఇంధన ధరల విషయంలో తీసుకున్న నిర్ణయమూ..లక్షలాది మందిపై ప్రభావం చూపే ప్రమాదముంది. నిజానికి...చలికాలంలో తమ ఇళ్లను హీట్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున ఇంధనాన్ని వినియోగిస్తారు. ఇప్పుడిది కూడా కాస్ట్‌లీ అయిపోవటం వల్ల చాలా మంది ఇబ్బందులు పడక తప్పేలా లేదు.
రాజకీయాల్లో మార్పులు..
బ్రిటన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రధాని లిజ్ ట్రస్ సర్కార్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత సంతతికి చెందిన హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ (42) బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. బ్రిటన్ హోం మంత్రిగా బ్రేవర్మన్ ఇటీవలే నియమితులయ్యారు. భారత సంతతికి చెందిన మరో మహిళ ప్రీతి పటేల్ స్థానంలో న్యాయవాది బ్రెవర్మాన్ ఆ బాధ్యతల్ని స్వీకరించారు. అయితే ఓ చిన్న తప్పిదం చేయడం వల్ల నైతికంగా బాధ్యత వహిస్తూ బ్రేవర్మాన్ తన పదవికి రాజీనామా చేశారు. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ ఆ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పన్నుల భారం తగ్గించడం వల్ల దేశం ఆర్థిక సంక్షోభంలో పడిపోయిందని ఆమె అన్నారు. పన్నుల భారం తగ్గించడంపై యూటర్న్ తీసుకున్నందుకు ఆమె దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 100 మంది ఎంపీలు లిజ్ ట్రస్‌కు వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టారు. ఈ మేరకు ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్టూ సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన లేఖలు సిద్ధం చేసుకున్నారు. కన్జర్వేట్ పార్టీ కమిటీ హెడ్ గ్రహమ్ బ్రాడీకి ఈ లెటర్స్ సమర్పించనున్నారు. అక్టోబర్ 24వ తేదీ లోపు ఆమెను తప్పిస్తారన్న వార్తలూ జోరుగానే వినిపిస్తున్నాయి.
Also Read: Viral Video: హెడ్ ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్ దాటుతున్నారా? ఈ వీడియో చూడండి!