Delhi Woman Kidnapped: దిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ఎంత పెద్ద సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశం ప్రతి మూలలోని యువత దీనిపై విపరీతంగా స్పందించింది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ప్రతి ఒక్కరూ డిమాండ్ చేశారు. దేశ రాజధాని దిల్లీలో జరిగిన ఆ ఘటన దేశానికి చెడ్డ పేరు తీసుకువచ్చింది. మహిళను అపహరించి కదిలే బస్సులోనే సామూహికంగా అత్యాచారం చేసి ప్రైవేటు పార్టుల్లో ఇనుప రాడ్లు, ఇతర వస్తువులు చొప్పించారు. అత్యంత అమానుషంగా ఆ మహిళపై గ్యాంగ్ రేప్ చేశారు. ఆ ఘటన తర్వాత నిర్భయ చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రకారం మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిపై కేసు పెట్టొచ్చు. దీని వల్ల అమానుష చర్యలు ఆగిపోతాయని అనుకున్నా ఎక్కడ కూడా తగ్గినట్లు కనిపించడం లేదు. 


తాజాగా నిర్భయ లాంటి ఘటన జరిగిన అదే దిల్లీలో మరో మహిళపై కొందరు వ్యక్తులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆస్తి విషయంలో మహిళపై కక్ష పెంచుకున్న ఐదుగురు వ్యక్తులు బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రైవేటు భాగంలోకి ఇనుప రాడ్డు చొప్పించారు. నంద్ నగరికి చెందిన 36 ఏళ్ల బాధితురాలు ఈ నెల 16న ఉత్తర్ ప్రదేశ్ లోని గాజియాబాద్ లో సోదరుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరు అయ్యారు. తిరిగి వచ్చేందుకు బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో.. నిందితులు కారులో వచ్చి ఆమెను గన్ తో బెదిరింది కారులో బలవంతంగా ఎక్కించుకున్నారు. నిర్మానుష ప్రాంతానికి ఆమెను తీసుకు వెళ్లి ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 


ఐదుగురు వ్యక్తులు ఆమెపై రెండు రోజుల పాటు ఈ అమానుషాన్ని కొనసాగించారు. అనంతరం ఆ మహిళను గోనె సంచిలో కట్టి గాజియాబాద్ సమీపంలో రోడ్డుపై పడేసి వెళ్లి పోయారు. గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నెల 18వ తేదీన గాజియాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘోరమైన స్థితిలో మహిళను గుర్తించిన పోలీసులు ఆమెను దగ్గరలోని ఆస్పత్రిలో చేర్పించారు. విచారణలో భాగంగా మహిళకు, ఆ వ్యక్తులకు మధ్య ఆస్తి తగాదా నడుస్తోందని గుర్తించారు. నిందితుల కోసం గాలించి నలుగురిని అరెస్టు చేసినట్లు గాజియాబాద్ ఎస్పీ నిపుణ్ అగర్వాల్ తెలిపారు. మహిళకు ఆస్పత్రిలో చికిత్స నడుస్తోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, అంతర్గతంగా ఎలాంటి గాయాలు కనిపించలేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మహిళపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారని, అనంతరం ఆమె ప్రైవేటు భాగాల్లోకి ఇతర వస్తువులు బలవంతంగా చొప్పించారని గురు తేగ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. 


ఆస్తి తగాదాల వల్లే నిందితులు, బాధితురాలిపై అమానుషకాండకు తెగబడ్డారని, కోర్టులో కేసు కూడా నడుస్తోందని పోలీసులు వెల్లడించారు. బాధిత మహిళపై అత్యాచారం చేసిన తర్వాత, తన ప్రైవేటు భాగంలో ఇనుప రాడ్డు చొప్పించారని బాధితురాలు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే బాధితురాలికి మేరఠ్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించాలని ప్రయత్నించగా.. బాధితారులు అందుకు నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఆమెను మేరఠ్ మెడికల్ కాలేజీకి తీసుకు వెళ్లేందుకు ఆమె అంగీకరించలేదని వెల్లడించారు.