UIDAI Aadhaar Card Update: భారత పౌరులకు ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఆధార్ కార్డుకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. మీరు ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లయితే కనుక వెంటనే ఈ అప్‌డేట్ (Aadhaar Card Update) చేసుకోండి.
వివరాలు
ఆధార్ పొంది పదేళ్లు దాటిన వారు.. గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలను మళ్లీ సమర్పించాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సూచించింది. గత పదేళ్లలో ఆధార్‌ను ఒక్కసారి కూడా అప్డేట్ (Aadhaar Card Update) చేయనివారు ఈ పని చేయాలని కోరింది.
అయితే ఐడెంటిటీ, రెసిడెన్స్ ప్రూఫ్ డాక్యుమెంట్లను సమర్పించడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను మై ఆధార్ పోర్టల్‌తోపాటు దగ్గర్లోని ఆధార్ సెంటర్లలో నిర్దేశిత రుసుము చెల్లించి చేసుకోవచ్చని తెలిపింది.
దేశంలోని పౌరులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులను జారీ చేస్తోంది. వీటికి ఐరిస్, వేలిముద్రలు, ఫొటోలను ప్రామాణికంగా తీసుకుంటుంది. ఇలా కేటాయించిన ఆధార్ నంబర్‌ను ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక సహా ఇతర అవసరాలకు ప్రభుత్వం ఉపయోగిస్తోంది.
ఆధార్
ప్రస్తుతం ఆధార్ కలిగిన వారి శాతం 93 శాతం కంటే ఎక్కువే. దేశంలో దాదాపు 50,000 ఆధార్ అప్డేట్ కేంద్రాలు ఉన్నాయి. ఫోన్ నంబర్, చిరునామాలను అప్డేట్ చేసేందుకు 1,50,000 మంది పోస్ట్ మ్యాన్లను వినియోగిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. దీని ద్వారా నకిలీ లబ్ధిదారులను గుర్తించి నిధులు దుర్వినియోగం కాకుండా.. ప్రజాధనం ఆదా చేయడానికి సహాయపడుతుందని తెలిపింది.
సుప్రీం ఆదేశాలు
ఆధార్ కార్డుల జారీ విషయంలో సుప్రీం కోర్టు ఈ ఏడాది కీలక ఆదేశాలు ఇచ్చింది. దేశంలోని ప్రతి వ్యక్తికి గౌరవం పొందాల్సిన ప్రాథమిక హక్కు ఉందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కరోనా సమయంలో సెక్స్ వర్కర్లు ఎదుర్కొన్న సమస్యలపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు... వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలని ఆదేశించింది.
యూఐడీఏఐ జారీ చేసే ప్రొఫార్మా సర్టిఫికేట్ ఆధారంగా.. ఆధార్ కార్డులు ఇవ్వాలని సూచించింది. సెక్స్ వర్కర్ల గుర్తింపును బహిర్గతం చేయకూడదని, వారి గోప్యతను కాపాడాలని జస్టిస్ లావు నాగేశ్వర రావు నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
సీబీఓ (కమ్యునిటీ బేస్డ్ ఆర్గనైజేషన్) గుర్తించిన సెక్స్ వర్కర్లకు ఓటర్ ఐడీలు సైతం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సెక్స్ వర్కర్లకు రేషన్ అందించాలని ఇదివరకే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారికి ఎటువంటి గుర్తింపు కార్డులు లేదన్న కారణంతో.. రేషన్ పంపిణీని అడ్డుకోవద్దని సూచించింది.
Also Read: Russia Ukraine Conflict: 'అణు బాంబు వేస్తే మా పవర్ చూపిస్తాం'- పుతిన్‌కు జీ7 దేశాల వార్నింగ్
Also Read: IAF MiG 29K Fighter Jet Crash: సముద్ర తీరంలో కుప్పకూలిన మిగ్- 29కే- పైలట్ సేఫ్!