TTD Chairman responded to Pawan demand to apologize: తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలకు క్షమాపణలు చెప్పడంలో తప్పు లేదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం తిరుమలలో నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. అయితే క్షమాపణలు చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా అని ప్రశ్నించారు. ఎవరో ఏదో మాట్లాడినంత మాత్రాన స్పందించాల్సిన అవసరం లేదన్నారు. తప్పిదం జరిగిందని.. ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మృతుల కుటుంబాలకు పాతిక లక్షల పరిహారం ప్రకటించారని.. వాటిని శనివారం ఇళ్లకు వెళ్లి అందచేస్తామని తెలిపారు.
వచ్చే ఏడాది నుంచి కీలక మార్పులు
టిక్కెట్ల జారీ కోసం చేసిన ఏర్పాట్లలో మాత్రం లోపం లేదని టీటీడీ చైర్మన్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టీటీడీ బోర్డు అత్యవసర సమావేశాలను నిర్వహించామన్నారు. ఈ ఏడాది పది రోజుల ముక్కోటి ఏకాదశి దర్శనాలను కొనసాగిస్తామన్నారు. ఏ రోజు టోకెన్లు ఆ రోజు ఇవ్వాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచి ఆగమశాస్త్ర నిపుణులు, అధ్యాత్మిక వేత్తల సలహాల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. తప్పిదం ఎలా జరిగిందన్నదానిపై న్యాయవిచారణ జరిపిస్తామని బీఆర్ నాయుడు తెలిపారు. కావాలని ఎవరైనా చేశారా లేదా అన్నదనిపైనా విచారణ ఉంటుందన్నారు.
తొక్కిసలాట ఘటన లోఆరుగురు చనిపోవడంతో టీటీడీ వారికి నష్టపరిహారంతో పాటు ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించుకుంది. శనివారమే మృతుల కుటుంబీకుల ఇళ్లకు టీటీడీ అధికారులు వెళ్లి చెక్కులు ఇస్తారు. అలాగే వారి కుటుంబాల్లో అర్హత ఉన్న వారికి కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా ఇవ్వాలని బోర్డు సమావేశంలో నిర్ణయించారు. అంతకు ముందు పవన్ పిఠాపురంలో తిరుమల తొక్కిసలాట ఘటనపై కచ్చితంగా టీటీడీ పాలక మండలి క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
క్షమాపణ చెప్పడానికి నామోషీ ఎందుకని ప్రశ్నిస్తున్న పవన్ కల్యాణ్
పిఠాపురంలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తొక్కిసలాట ఘటనపై తాను క్షమాపణ చెప్పానని... అధికారులకు ఎందుకు నామోషీ అని ప్రశ్నించారు. అదే టైంలో టీటీడీ ఛైర్మన్, ఈవో కూడా సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులు చేసిన తప్పిదం వల్ల సంక్రాంతి సంబరాలు కూడా జరుపుకోలేని దుస్థితి ఏర్పడిందని వాపోయారు. సనాతన ధర్మం ఆచరిస్తూ తాను క్షమాపణ చెప్పాననని ... హిందువులు అందర్నీ క్షమించాలని అడిగానన్నారు. ఎవరి బాధ్యత వారు నిర్వర్తిస్తే ఇలాంటి దుర్ఘటనలు జరగవన్నారు. బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు కూడా పవన్ కల్యాణ్ టీటీడీ చైర్మన్, ఈవో, జేఈవోపై మండిపడ్డారు.