Free IVF Treatment for American women అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ మహిళల కోసం క్రేజీ ఆఫర్ ప్రకటించారు. తాను అధికారంలోకి వస్తే మహిళలకు IVF ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఆరోగ్య బీమా కంపెనీలు సైతం తప్పనిసరిగా తమ పాలసీలో ఈ పథకాన్ని చేర్చేలా చూస్తానని ఆయన అన్నారు.
నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. పోటీ నువ్వా నేనా అనేలా సాగుతున్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు ట్రంప్ కొత్త కొత్త ఆఫర్లతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా IVF ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని తన ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. సహజ పద్ధతిలో సంతానం కోసం ప్రయత్నించి విఫలమైన మహిళలు IVF విధానాన్ని ఎంచుకుంటారు. చాలాకాలంగా ఈ విధానం ప్రాచుర్యంలో ఉంది. మహిళల్లోని అండాన్ని, పురుషుల్లోని వీర్యాన్ని కలిపి ల్యాబ్‌లో ఫలదీకరణం జరిపించి తర్వాత మహిళ గర్భాశంలో ప్రవేశపెడతారు. అయితే ఈ విధానంలో గర్భం నిలబడుతుందని గ్యారంటీ ఉండదు. మధ్యలో గర్భ విచ్ఛిత్తి కావడమో మరే కారణాలతోనో కొంతమంది మహిళలు ఈ IVF విధానాన్ని రెండు మూడుసార్లు ప్రయత్నించిన సందర్భాలు కూడా కోకొల్లలు.
IVF ద్వారా బిడ్డలను కనడం కొంచెం ఖర్చుతో కూడుకున్నది. కనీసం 10 వేల అమెరికన్ డాలర్లు ఖర్చవుతోంది. ఒకసారి ప్రయత్నించి విఫలమైనవారు, ఈ ఖర్చును భరించలేని మహిళలు మాతృత్వానికి దూరం అవుతున్నారు. అలాంటి వారి ఆర్థిక సమస్యలతోపాటు బిడ్డలను కనాలన్న ఆ దంపతుల కలను నిజం చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ట్రంప్ ప్రచారం చేస్తున్నారు.
Also Read: అమెరికాను వణికిస్తున్న దోమలు- పార్క్‌లు మూసివేత- ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరికలు
గురువారం మిచిగాన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ ఈ కొత్త ఎన్నికల హామీని ప్రకటించారు. IVF చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని లేదా బీమా కంపెనీ చెల్లించేలా చూస్తానని ట్రంప్ ప్రకటించారు. 1973లో రే వర్సెస్ వేడ్ కేసులో అనివార్య పరిస్థితుల్లో మహిళలకు గర్భవిచ్చిత్తి చేయించుకునే హక్కు ఉందని అమెరికా సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఇదే న్యాయస్థానం గతేడాది ఆ తీర్పును కొట్టివేస్తూ మరోసారి కొత్త తీర్పు చెప్పింది. ఈ విషయంపై గత కొన్నాళ్లుగా ట్రంప్ భిన్నమైన వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. చివరికి ఈ అంశాన్ని ఆయా రాష్ట్రాలకు వదిలేయడమే మంచిదనే నిర్ణయం ప్రకటించారు. ఈ ప్రకటనపై డెమోక్రాట్లు ట్రంప్‌పై తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
Also Read: నమీబియాలో కరవు- ప్రజల ఆకలి తీర్చడానికి అడవి జంతువుల వధ