EEE Virus in America: ఒక దోమ దెబ్బకు అమెరికా గజగజ వ‌ణికిపోతోంది. అందుకే ఓ ప్రాంతంలో దాదాపు అత్యవసర పరిస్థితిలాంటి వాతావరణాన్ని కల్పించారు.  ఈ దోమ కారణంగా ఈస్ట్రన్‌ ఎక్వైన్‌ ఎన్‌కెఫలైటిస్‌ అనే వైరస్‌ (EEEV) వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి బారినపడి అమెరికాలోని న్యూ హ్యాంప్‌ షైర్‌లో ఒక వ్యక్తి మరణించాడు. నాడీ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన రుగ్మ‌త‌ల‌తో ఆస్ప‌త్రిపాలైన బాధితుడు ఇన్ఫెక్ష‌న్‌కు గురై చ‌నిపోయాడు. ప‌దేళ్ల త‌ర్వాత ఈ ఇన్ఫెక్ష‌న్ మ‌ళ్లీ వెలుగు చూసింది.


ఏటా సగటున 11 మంది మృతి 


EEEV వైర‌స్ బారిన ప‌డిన వారిలో మూడో వంతు మంది ప్రాణాలు కోల్పోతుంటారు. కోలుకున్న‌వారిలో కూడా జీవితాంతం శారీర‌క‌, మాన‌సిక రుగ్మ‌త‌ల‌తో బాధ‌ప‌డుతూనే ఉండ‌టం ఈ వైర‌స్ కి ఉన్న మరో లక్షణం. ఈ వైర‌స్‌కు ఇంత‌వ‌ర‌కు టీకా కానీ లేదా యాంటీ వైర‌ల్ చికిత్స కానీ లేకపోవడంతో ఆందోళన పెరుగుతోంది. అమెరికాలో ఏటా స‌గ‌టున 11 మంది ఈ వైర‌స్ బారిన ప‌డి చ‌నిపోతుంటార‌ని సెంట‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ పేర్కొంటోంది. 2014లో న్యూ హాంప్‌షైర్‌లో ముగ్గురికి ఈ వైర‌స్ సోక‌గా ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. 


Also Read: యూకే అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఫాస్ట్ - పదిహేనేళ్లకే కానిచ్చేస్తున్నారట !


ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిక- పార్క్‌లు మూసివేత 


హాంప్‌షైర్‌ రాష్ట్ర అధికారుల‌ను EEEV వైర‌స్ ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. అవ‌స‌రం అయితే త‌ప్ప ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. ప‌బ్లిక్ పార్కుల‌ను మూసివేసి దోమ‌ల నివార‌ణ మందులు పిచికారీ చేస్తున్నారు. వాతావ‌ర‌ణంలో మార్పుల కార‌ణంగా ఈ వైర‌స్ విస్త‌రిస్తుంద‌ని వైద్యులు చెబుతున్నారు. ఈ ఆగ‌స్టు ప్రారంభంలో మ‌సాచుసెట్స్‌లో 80 ఏళ్ల వ్య‌క్తిలో ఈ వైరస్ ఉన్న‌ట్టు వైద్యులు గుర్తించారు. ఈ ఏడాదిలో ఇదే మొద‌టి కేసు. EEE వైరస్ సోకిన వ్యక్తికి తలనొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరం, మూర్ఛ, ప్రవర్తనలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయ‌ని సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ పేర్కొంటోంది. ఈ వైర‌స్ సోకిన వారు  మెద‌డు, వెన్నుపాము చుట్టూ మంట వంటి తీవ్ర‌మైన నాడీ సంబంధిత వ్యాధులతో బాధ‌ప‌డ‌తార‌ని వైద్యులు చెబుతున్నారు. 


Also Read: న‌మీబియాలో క‌రవు- ప్ర‌జ‌ల ఆక‌లి తీర్చ‌డానికి అడ‌వి జంతువుల వ‌ధ


పరిసరాల పరిశుభ్రతే మందు


టీకా లేదా మందులు అందుబాటులో లేని ఈ వైర‌స్ 15 నుంచి 50 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న‌వారికి  చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన‌దిగా చెబుతున్నారు. శ‌రీరాన్ని పూర్తిగా క‌ప్పి ఉంచేలా దుస్తులు ధ‌రించాల‌ని, దోమల కుట్ట‌కుండా జెల్‌లు, క్రీమ్‌లు ఉప‌యోగించాల‌ని సూచిస్తున్నారు. అధికారులు ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త విష‌యంలో మ‌రింత శ్ర‌ద్ధ చూపాల‌ని, ఇళ్ల చుట్టూ నీరు చేర‌కుండా నిరోధించాల‌ని హెచ్చ‌రిస్తున్నారు. త‌క్ష‌ణ నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అక్క‌డి 5 ప‌ట్ట‌ణాల్లో పాక్షిక లాక్‌డౌన్ విధించారు. 


Also Read: అమెరికా అధ్య‌క్షుల‌ను నిర్ణ‌యించేది ఆ రాష్ట్రాలే- ఏడింటిపైనే కన్నేసిన డొనాల్డ్ ట్రంప్‌, క‌మ‌లా హారిస్‌