Traffic Fines in Karnataka: కారులో వెళ్తున్నారా? అయితే ఈ రూల్ మర్చిపోకండి? ఎందుకంటే మర్చిపోతే రూ.1000 ఫైన్ తప్పదు. ఇక వాహనం వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణికులు కూడా తప్పనిసరిగా సీటు బెల్టులు ధరించాల్సిందే. లేకపోతే మోటారు వాహనాల చట్టంలోని నిబంధనల ప్రకారం రూ.1,000 జరిమానా విధిస్తామని కర్ణాటక పోలీసులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక పాటించాల్సిందే!
ఈ మేరకు కర్ణాటక అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) (రోడ్డు భద్రత) ఆర్ హితేంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని పోలీసు కమిషనరేట్‌లు, ఎస్పీలు ఈ ఆదేశాలను పాటించాలని కోరారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సెప్టెంబరు 19 ఇచ్చిన లేఖ ఆధారంగా ఈ ఉత్వర్వులు జారీ చేశారు.
2022లో (ఆగస్టు చివరి వరకు) రోడ్డు ప్రమాదాల కారణంగా కర్ణాటకలో ప్రతిరోజూ సగటున 31 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్ర పోలీసుల వివరాల ప్రకారం, 2022లో ఆగస్టు నెలాఖరు వరకు రోడ్డు ప్రమాదాల్లో సుమారు 7,634 మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఒక పోలీసు అధికారి ప్రకారం, బెళగావి, బెంగళూరు నగరం, తుమకూరు జిల్లాల్లో ఇలాంటి కేసులు అత్యధికంగా నమోదయ్యాయి.
కీలక నిర్ణయం
వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ ఇటీవల కారు ప్రమాదంలో మరణించిన తర్వాత వాహనాలలో వెనుక సీట్లకు కూడా సీట్ బెల్ట్ బీప్ సిస్టమ్ పెట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. టాటా మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. కారు డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో మిస్త్రీ వెనుక సీట్లో కూర్చొన్నారు. కానీ సీట్ బెల్ట్ ధరించలేదు.
సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (CMVR)లోని రూల్ 138 (3) ప్రకారం వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణికులు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. కానీ చాలా మంది పెట్టుకోరు. ఇది తప్పని సరి అని చాలా మందికి తెలియదు. కొందరికి తెలిసినప్పటికీ విస్మరిస్తుంటారు.
వెనుక సీట్లో కూర్చొని సీటు బెల్టు పెట్టుకోని వారిని పోలీసులు చూసినా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. వారిపై ఎలాంటి జరిమానాలు కూడా విధించడం లేదు. అందుకే దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఇటీవలి రోడ్డు మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, 2020లో సీటు బెల్ట్ ధరించకపోవడం వల్ల 15,146 మంది మరణిస్తే... 39,102 మంది గాయపడుతున్నారు.
సేఫ్టీ
ప్రయాణ సమయంలో కారు స్కిడ్ అయితే సీటు బెల్ట్ మిమ్మల్ని కారులో సీటు నుంచి జారిపోకుండా కాపాడుతుంది. ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హైవే సేఫ్టీ ప్రకారం.. వాహనం ప్రమాదానికి గురైనప్పుడు సీటు బెల్టు పెట్టుకుంటే వాహనంలో నుంచి బయటపడరు. కారు లోపలే ఉండటం మూలంగా ప్రాణాలకు ముప్పు కలగకుండా ఉంటుంది. సీటు బెల్టు తల, ఛాతీ, వెన్నెముక, పొత్తి కడుపుపై బలమైన గాయాలు కాకుండా కాపాడుతుంది.
కారులో ప్రయాణిస్తుంటే.. ప్రయాణీకుల శరీరం కూడా అదే వేగంతో ముందుకు వెళ్తుంది. ఆ సమయంలో ప్రమాదం జరిగితే
డ్రైవర్ స్టీరింగ్ వీల్, డ్యాష్ బోర్డ్ లేదంటే సైడ్ విండోను తాకే అవకాశం ఉంటుంది. సీట్ బెల్ట్ ధరించడం వలన ప్రయాణీకులు సీటుకు సురక్షితంగా ఉంటారు. కారు అకస్మాత్తుగా ఆగిపోతే వారి బాడీ కూడా అలాగే ఆగిపోతుంది. ప్రమాద సమయంలో తలకు బలమైన గాయాలు అవుతాయి. ఈ గాయాలు ఒక్కోసారి ప్రాణాలు తీసే అవకాశం ఉంది. అదే సమయంలో వెన్నెముక సైతం దెబ్బతినే అవకాశం ఉంటుంది. సీటు బెల్టు మూలంగా సీటుకు అంటిపెట్టుకుని ఉంటారు.
Also Read: PM Modi's Diwali Gift: దీపావళికి ప్రధాని మోదీ బంపర్ గిఫ్ట్- ఏంటో తెలుసా?