దీపావళికి స్వీట్లు చేసేందుకు చాలా తక్కువ సమయమే మీ దగ్గర ఉందా? అయితే ఈ హల్వాలు చేసి చూడండి. నోట్ల పెట్టగానే కరిగిపోతాయి, సులువుగా అయిపోతాయి. ఒక్కసారి చేసుకుంటే ఓ వారం రోజులు నిల్వ ఉంటాయి. ఇంకెందుకాలస్యం ఎలా చేయాలో చూడండి మరి.
గోధుమ హల్వా
కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి - ఒక కప్పు
నీళ్లు - రెండు కప్పులు
బెల్లం తురుము - ఒక కప్పు
యాలకుల పొడి - అర స్పూను
నెయ్యి - అరకప్పు
జీడిపప్పులు - అర కప్పు
తయారీ ఇలా
1. ఒక కళాయిలో అరకప్పు నెయ్యిని వేసి వేడిచేయాలి. అది వేడెక్కాక గోధుమపిండిని వేసి వేయించాలి.
2. ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి.
3. అందులో బెల్లం తురుము వేసి కలపాలి. బెల్లం కరిగాక మిశ్రమాన్ని బాగా కలపాలి.
4. ఆ మిశ్రమంలో మరిగించిన నీళ్లను రెండు కప్పులు వేసి కలుపుతూ ఉండాలి.
5. పిండి కళాయికి అతుక్కోకుండా కలుపుతూనే ఉండాలి.
6. యాలకుల పొడి, వేయించిన జీడిప్పులు వేసి కలపాలి.
7. హల్వాలా చిక్కగా అయ్యే దాకా కలిపి స్టవ్ కట్టేయాలి.
8. ఇప్పుడు ఓ ప్లేటుకు నెయ్యి రాసి హల్వా మిశ్రమాన్ని వేడిగా ఉన్నప్పుడే అందులో వేయాలి. వేడి వేడి హల్వా రెడీ అయిపోయింది.
....................................................................
కొబ్బరి హల్వా
కావాల్సిన పదార్థాలు
కొబ్బరికోరు - ఒక కప్పు
పాలు - ఒకటిప్పావు కప్పు
పంచదార - నాలుగు స్పూన్లు
జీడిపప్పులు - ఒక స్పూను
నెయ్యి - రెండున్నర స్పూన్లు
తయారీ ఇలా
1. కళాయిలో నెయ్యి వేసి జీడిపప్పులు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు పాలు మరిగించి చల్లార్చి పెట్టుకోవాలి.
3. కళాయిలో మిగిలిన నెయ్యిలో కొబ్బరికోరు వేయించి పెట్టుకోవాలి.
4. వేగిన కొబ్బరికోరు కాచి చల్లార్చిన పాలు వేసి చిన్న మంట మీద ఉడికించాలి.
5. పాలు ఇంకే వరకు చిన్న మంట మీద ఉంచి కలుపుతూనే ఉండాలి.
6. పాలు ఇంకిపోయాక పంచదార కలుపుకోవాలి.
7. పంచదార కరిగి కొబ్బరికోరులో కలిసిపోయే దాకా ఉడికించాలి.
8. మిశ్రమం చిక్కగా మారాక నెయ్యి కలపాలి.
9. దించే ముందు వేయించిన జీడిపప్పులు వేసుకోవాలి.
Also read: చీరమీను చేపలతో గారెలు, ఇగురు కూర - చూస్తేనే నోరూరిపోతుంది