గోదావరి జిల్లాల్లో పులసకు ఎంత గిరాకీ ఉందో, చీరమీను చేపలకు అంతే క్రేజ్ ఉంది. ఇవి ఏడాదిలో రెండు మూడు వారాలే దొరుకుతాయి కాబట్టి ధర కూడా అధికంగానే ఉంటుంది. చేతి వేళ్ల సందుల్లోంచి, వలల రంధ్రాల నుంచి కూడా జారిపోయేంత చిన్నవి ఉంటాయని ఒకప్పుడు వీటిని చీరలతో పట్టేవారట. అందుకే ఈ చేపలకు ‘చీరమీను’ అనే పేరొచ్చిందని చెబుతారు. ఈ చిట్టి చేపలను గారెల్లా చేసుకుని తింటే రుచి అదిరిపోతుంది. అలాగే ఇగురు కూడా వండుకుంటే వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఆ టేస్టే వేరు. ఈ చేపలు అన్ని ప్రాంతాల వారు తినలేరు. గోదారి ప్రాంత వాసులకు చీరమీను అధికంగా దొరుకుతుంది.


చీరమీను గారెలు
కావాల్సిన పదార్థాలు
చీరమీను - ఒక కిలో
పసుపు - పావు స్పూను
కారం - నాలుగు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - మూడు 
శెనగ పిండి - నాలుగు స్పూన్లు
బియ్యంపిండి - ఆరు స్పూన్లు
నూనె - వేయించడానికి సరిపడా
ధనియాల పొడి - రెండు స్పూన్లు
జీలకర్ర పొడి - ఒక స్పూను
అల్లం తరుగు - రెండు స్పూన్లు


తయారీ ఇలా
1. చీరమీను చేపలు ఓసారి శుభ్రంగా కడగాలి. 
2. ఒక గిన్నెలో కారం, పసుపు, ఉప్పు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి కలపాలి. 
3. అందులోనే శెనగపిండి, బియ్యంపిండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం తరుగు వేసి కలపాలి. 
4. చివర్లో చేపలు వేసి కలుపుకోవాలి. 
5. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. 
6. నూనె వేడెక్కాక చేపల మిశ్రమాన్ని గారెల్లా ఒత్తుకుని వేయించాలి. 
7. రంగు బంగారు రంగులోకి మారాక తీసి ప్లేటులో వేసుకోవాలి. 
8. ఏ చట్నీ అవసరం లేకుండానే చేపల గారెలు తినవచ్చు. 


.......................................................................


చీరమీను ఇగురు కూర
కావాల్సిన పదార్థాలు
చీరమీను - ఒక కిలో
టమోటాలు - నాలుగు
పచ్చిమిర్చి - నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
పసుపు - పావు స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కారం - రెండు స్పూన్లు
ఉల్లిపాయలు - రెండు 
గరం మసాలా - అరస్పూను


తయారీ ఇలా
1. చీరమీను చేపలను ఉప్పు, పసుపు కలిపి కడిగి పక్కన పెట్టుకోవాలి. 
2. ఇప్పుడు ఆ చేపల్లో కారం, పసుపు, ఉప్పు వేసి పదినిమిషాలు మారినేట్ చేయాలి. 
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. 
4. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలపాలి. 
5. సన్నగా తరిగిన టమోటా వేసి బాగా కలపాలి. 
6. టమోటా మెత్తగా అయి ముద్దలా మారేవరకు ఉడికించాలి. 
7. టమోటా మెత్తగా ఉడికాక అందులో గరం మసాలా కలపాలి. 
8. చివర్లో మారినేట్ చేసిన చేపలు వేసి మెల్లగా కలపాలి. 
9. కూర ఇగురులా మారాక స్టవ్ కట్టేయాలి. 
వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే రుచి అదిరిపోతుంది. 


Also read: పిల్లలు తలనొప్పి అంటున్నారా? కారణాలు ఇవి కావచ్చు, తేలికగా తీసుకోకండి