తలనొప్పి పిల్లలకు రాదు అనే భావన చాలా మందిలో ఉంది. కానీ పూర్తిగా తప్పు. పిల్లలకు కూడా ఒక్కోసారి తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. వారు నొప్పి వస్తోందని చెబితే పట్టించుకోకపోవడమో, తేలికగా తీసుకోవడమో చేస్తుంటారు పెద్దలు. కానీ కొన్ని సార్లు ఆ నొప్పి ప్రమాదకరమైన సమస్యలకు తొలి సంకేతం కావచ్చు. ఎందుకంటే నాడీ సమస్యలతో బాధపడే పిల్లల్లో ఏడు నుంచి 10 శాతం మందికి తలనొప్పి వస్తోంది. అయితే పిల్లలు తలనొప్పిని సరిగా చెప్పలేకపోవచ్చు. తలను పట్టుకుని నొప్పి అనగానే, చేత్తో రుద్దేసి ‘తగ్గిపోతుందిలే’ అని చెప్పి ఊరుకోవద్దు. ఎప్పట్నించి వస్తోంది? ఎక్కడ వస్తోంది? ఇలా కాస్త వివరాలు వారి చేత చెప్పింది, వైద్యులకు చూపించడం ఉత్తమం. చాలాసార్లు తలనొప్పి వచ్చి దానికదే తగ్గిపోతుంది. పిల్లలు తరచూ తలనొప్పి అంటే మాత్రం తేలికగా తీసుకోకుండా వైద్యులకు చూపించాలి.  


తలనొప్పి ఎన్ని రకాలు?
వచ్చిపోయే తలనొప్పులు మూడు రకాలు ఉన్నాయి. అందులో మొదటిది హఠాత్తుగా నొప్పి మొదలవుతుంది. ఇది కచ్చితంగా పట్టించుకోవాల్సిన పరిస్థితి. దీనికి మెదడులో నరాలు చిట్లడం, మెదడులో ఇన్ఫెక్షన్, మెదడులో కణితి ఏర్పడడం లేదా అధిక రక్త పోటు వల్ల వచ్చే అవకాశం ఉంది. ఇక రెండోది స్వల్పకాలానికి వచ్చి పోయేది. తరచూ కాసేపు నొప్పి పోతుంటే దానికి కారణాలేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది బ్యాక్టిరియా కారణం మెదడులోని పొరలు ఉబ్బడం, ద్రవం చేరడం, ట్యూమర్ పెరగడం కూడా కారణం కావచ్చు. మూడోరకం ఎక్కువ కాలం పాటూ తలనొప్పి రావడం. దీన్ని దీర్ఘకాల తలనొప్పి అంటారు. ఈ నొప్పి నెలల తరబడి ఉండొచ్చు. ఇది పిల్లల్లో మైగ్రేన్, ఒత్తిడికి కారణం కావచ్చు. 


ఎప్పుడు వైద్యులను కలవాలి?
పిల్లలు తలనొప్పి వస్తోందని చెప్పాక వారు సరిగా మాట్లాడ లేకపోయినా, నడవ లేక పోయినా, బలహీనంగా అనిపించినా, వాంతులు అయినా, చూపు మసకబారినా వెంటనే వైద్యులను కలవాలి. ఇవన్నీ మెదడు సమస్యకు కారణం అయ్యే అవకాశం ఉంది. మూడేళ్ల లోపు పిల్లలు నోటితో ఏదీ చెప్పలేరు కాబట్టి, వారు తలపట్టుకుని ఏడుస్తున్నా, తరచూ ఏడుస్తున్నా ఓసారి వైద్యుడిని సంప్రదించడం మంచిది. 


Also read: అయిదు గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి









గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.