Toshakhana Case: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే పదేళ్ల జైలు శిక్ష పడగా..ఇప్పుడు ఆయన భార్య బుశ్రా బీబీకి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఇదే తోషాఖానా కేసులో ఆమెకి ఈ శిక్ష విధించారు. మరో పదేళ్ల పాటు ఎలాంటి రాజకీయాలు చేయకుండా ఆంక్షలు విధించిన కోర్టు రూ.787 మిలియన్‌ల జరిమానా కట్టాలని ఆదేశించింది. దేశ రహస్యాలను బహిర్గతం చేశారన్న కేసులో ఇమ్రాన్ ఖాన్‌కి పదేళ్ల జైలు శిక్ష పడింది. సైఫర్ కేసు అనేది దౌత్యపరమైన సమాచారానికి సంబంధించిన అంశం. గతేడాది మార్చిలో వాషింగ్టన్ లోని రాయబార కార్యాలయం పంపిన రహస్య దౌత్య కేబుల్ (సైఫర్)ను బహిర్గతం చేశారని ఇమ్రాన్ ఖాన్ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. అయితే, ఈ కేసులో తనను ప్రధాని పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతుందని అప్పట్లో ఇమ్రాన్ ఆరోపించారు. ఆ తర్వాత 2022 ఏప్రిల్ నెలలో అవిశ్వాస తీర్మానంలో ఓడి పాక్ ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించగా.. ఆగస్ట్ 5, 2023న ఇమ్రాన్ జైలు పాలయ్యారు. అయితే, ఇస్లామాబాద్ హైకోర్టు ఆయన శిక్షను రద్దు చేయగా.. ఇతర కేసుల్లో ఆయన్ను పోలీసులు నిర్బంధించారు.






Dawn పేపర్ ఇచ్చిన వివరాల ప్రకారం...2020లో ఓ జర్నలిస్ట్ రైట్‌ టు ఇన్‌ఫర్మేషన్ లా ఉపయోగించి సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చాడు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పెద్ద ఎత్తున గిఫ్ట్‌లు అందాయని వెల్లడించాడు. అయితే...నిపై అప్పటి పాక్ మంత్రులంతా మండి పడ్డారు. అలాంటి వివరాలు బయట పెడితే అంతర్జాతీయ దేశ పరువుకు భంగం వాటిల్లుతుందని అన్నారు. అప్పటికే Federal Information Commissionలో కేసు నమోదు చేశారు. అయినా ప్రభుత్వం జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఫలితంగా హైకోర్టుని ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన ఇస్లామాబాద్ హైకోర్టు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు బదులు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఇదే ఆయన పదవికి ఎసరు పెట్టింది. ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఇమ్రాన్‌పై అనర్హతా వేటు వేయాలని కోరాయి. గల్ఫ్ దేశాలు గిఫ్ట్ ఇచ్చిన కాస్ట్‌లీ వాచ్‌లను అమ్మేసి పెద్ద మొత్తంలో సంపాదించారని ఆయనపై ఆరోపణలొచ్చాయి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి బదులు ఇవ్వకపోవడం వల్ల పాక్ ఎన్నికల సంఘం ఇమ్రాన్‌పై అనర్హతా వేటు వేసింది. 2022లో ఉన్నట్టుండి ఆయన తన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఇదే కేసులో ఆయనను అరెస్ట్ చేశారు.


Also Read: Elon Musk: మానవ మెదడులో 'చిప్' - తొలి ప్రయోగం సక్సెస్ అంటూ ఎలాన్ మస్క్ కీలక ప్రకటన