Parthiv Patel Slams News : ఇంగ్లాండ్‌(England)తో రెండో టెస్ట్‌కు టీమిండియా(Team India) సిద్ధమవుతోంది. తొలి టెస్టులో అనూహ్య పరాజయం పాలై సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్‌ సేన... ఈ టెస్టులో గెలిచి మళ్లీ గాడిన పడాలని చూస్తోంది. రాహుల్‌(Kl Rahul), జడేజా(Jadeja) గాయం కారణంగా రెండో టెస్ట్‌ నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు జట్టు కూర్పు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌(Parthiv Patel) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫాస్ట్‌ బౌలర్‌ అవసరం లేనపుడు మహ్మద్‌ సిరాజ్‌(Mohammed Siraj)ను తప్పించి ఒక బ్యాటర్‌ను అదనంగా తీసుకోవడం ఉత్తమమని అభిప్రాయపడ్డాడు.


పార్థీవ్‌ ఏమన్నాడంటే..?
విశాఖ టెస్ట్‌లో పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను పక్కనపెట్టాలని పార్థివ్‌ పటేల్‌ సూచించాడు. ఫాస్ట్‌ బౌలర్‌కు ఎక్కువగా బౌలింగ్‌ చేసే అవకాశం ఇవ్వనపుడు సిరాజ్‌ జట్టులో ఉండి ఎలాంటి లాభం లేదని, అతడి స్థానంలో ఒక స్పెషలిస్టు బ్యాటర్‌కు అవకాశమివ్వాలని ఈ మాజీ వికెట్‌ కీపర్‌ సూచించాడు. ఉప్పల్‌లో జరిగిన తొలి టెస్టులో 11 ఓవర్లు మాత్రమే వేసిన సిరాజ్‌ 50 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. సహచర ఫాస్ట్‌ బౌలర్‌ బుమ్రా 24.4 ఓవర్లు వేసి బెన్ స్టోక్స్‌, రెహాన్‌ అహ్మద్‌, ఒలీపోప్‌, జోరూట్‌ లాంటి కీలక వికెట్లు తీశాడని వివరించాడు. మొదటి టెస్టులో కేవలం పదకొండు ఓవర్లు బౌల్‌ చేసిన ఈ సిరాజ్‌.. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడని పార్థీవ్‌ అన్నాడు. రెండో టెస్టులో సిరాజ్‌ అవసరం ఉండకపోవచ్చని వ్యాఖ్యానించాడు. జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉంటే సరిపోతుందని...  టెస్టు మొత్తంలో సిరాజ్‌ను కేవలం ఏడెనిమిది ఓవర్ల పాటే బౌలింగ్‌ చేయించాలనుకుంటే జట్టులో ఉంచడం ఎందుకని ప్రశ్నించాడు. సిరాజ్‌ సేవలను ఉపయోగించుకోనపుడు అతడి స్థానంలో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ను తీసుకోవాలని పార్థీవ్‌ సూచించాడు. ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో రెండో టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.


స్వదేశంలో తొలిసారి ఇలా...
హైదరాబాద్‌(Hyderabad) వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా(Team India)కు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. ఇంగ్లాండ్‌(England)తో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ జట్టు అనూహ్య ఓటమిని చవి చూసింది. భారత జట్టు 28 పరుగుల తేడాతో తొలి టెస్టులో ఓటమి పాలైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ జట్టు 1-0 ఆధిక్యాన్ని సాధించింది. టామ్‌ హార్టీలీ ఏడు వికెట్లతో భారత్‌ పతనాన్ని శాసించి బ్రిటీష్‌ జట్టుకు అపూరూపమైన విజయాన్ని అందించాడు. భారత జట్టు ఓటమితో రోహిత్‌ సేన ఆటతీరుపై మాజీలు మండిపడ్డారు. ఇదేం ఆటతీరంటూ విమర్శలు గుప్పించారు. తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల భారీ అధిక్యం లభించినప్పటికీ ఓటమి ఎదురుకావడం అభిమానులకు మింగుడుపడడం లేదు. ఈ ఓటమితో టీమిండియా ఓ అపఖ్యాతిని మూటగట్టుగుంది. టెస్టు క్రికెట్ చరిత్రలో స్వదేశంలో మొదటి ఇన్నింగ్స్‌లో 100కు పైగా పరుగుల అధిక్యం సాధించి కూడా టీమిండియా ఓటమి పాలవడం ఇదే మొదటిసారి. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ప్రధాన స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా 100కు పైగా పరుగులు సమర్పించుకున్నారు. ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో వీరిద్దరు 100కుపైగా పరుగులు సమర్పించుకోవడం ఇదే మొదటిసారి. అలాగే టెస్టు క్రికెట్‌లో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ఓడిపోవడం కూడా ఇదే మొదటిసారి.