Top Headlines Today: 


నేడు బందర్ పోర్టుకు శంకుస్థాపన 
కృష్ణాజిల్లాలోని బందరు పోర్టుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. 5.156 కోట్ల రూపాయలతో చేపడుతున్న బందరు పోర్టు నిర్మాణాన్ని రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని ప్లాన చేస్తోంది ప్రభుత్వం. కోర్టుల్లో ఉన్న వివాదాలు కూడా పరిష్కారమయ్యాయని ప్రభుత్వం చెబుతోంది. ఉదయం 8.30కు తాడేపల్లి నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి మచిలీపట్నం చేరుకుంటారు. అక్కడ తపసిపూడి గ్రామానికి చేరుకొని బందరు పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజ చేస్తారు. పైలాన్ ఆవిష్కరిస్తారు. అనంతరం జిల్లా పరిషత్‌ సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 


శ్రీనగర్‌లో జీ20 దేశాల సమావేశం
జీ20 దేశాల మూడో టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం శ్రీనగర్ లో జరగనుంది. అంతర్జాతీయ ఈవెంట్ ను విజయవంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దాల్ సరస్సు ఒడ్డున ఉన్న షెరీ కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (ఎస్కేఐసీసీ)లో నేటి సమావేశం జరగనుంది. ఈ సదస్సుకు జీ20 దేశాల నుంచి 20 మంది సహా 60 మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు.


హజ్ యాత్ర విమానాల షెడ్యూల్ విడుదల 


నేటి నుంచి ఆగస్టు 2 వరకు హైదరాబాద్ నుంచి హజ్ యాత్రికుల కోసం విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఆదివారం అధికారులు ప్రకటించారు. పదహారు ఎంబార్కింగ్ సెంటర్‌లు ఏర్పాటు చేశారు. వీలైనంత త్వరగా ఈ పాయింట్లకు చేరుకొని పత్రాలు వెరిఫై చేయించుకోవాలన్నారు. 


సంగారెడ్డిలో హరీష్ టూర్‌


తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు ఇవాళ సంగారెడ్డిలో పర్యటించనున్నారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొనున్నారు. 


సీఎం కప్ రెండో దశ పోటీలు


తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్‌ రెండో దశ పోటీలు ఇవాళ ప్రారంభంకానున్నాయి. 11 క్రీడాంశాల్లో ఆటగాళ్లు పోటీ పడనున్నారు. అథ్లెటిక్స్, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, హ్యాండ్‌బాల్‌, కబడ్డీ, రెజ్లింగ్, స్విమ్మింగ్‌, ఆర్చరీ, షూటింగ్, హాకీ, టెన్నీస్‌ కేటగరిల్లో పోటీలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు పోటీలు నిర్వహిస్తారు. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


MCX: 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో MCX రూ. 5.5 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అదే సమయంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 134 కోట్లుగా ఉంది.









నీల్‌కమల్: జనవరి-మార్చి కాలంలో నీల్‌కమల్‌ రూ. 48 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఈ కాలంలో కార్యకలాపాల ద్వారా రూ. 829 ఆదాయం వచ్చింది.


దొడ్ల డెయిరీ: Q4FY23లో రూ. 22 కోట్ల నికర లాభాన్ని ఈ డెయిరీ సంస్థ ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 23% YoY పెరిగి రూ. 724 కోట్లకు చేరుకుంది.


గోదావరి పవర్ అండ్‌ ఇస్పాత్: నాలుగో త్రైమాసికంలో గోదావరి పవర్ అండ్‌ ఇస్పాత్ నికర లాభం 58% తగ్గి రూ. 170 కోట్లకు పరిమితమైంది. ఆదాయం 8% తగ్గి రూ. 1,316 కోట్లుగా నమోదైంది.


దివీస్ ల్యాబ్స్: మార్చి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 64% YoY తగ్గి, రూ. 321 కోట్లకు పడిపోయిందని దివీస్ లాబొరేటరీస్ నివేదించింది. ఆదాయం 22.5% క్షీణించి రూ.1,951 కోట్లకు చేరుకుంది.


NTPC: మార్చితో ముగిసిన త్రైమాసికంలో, విద్యుత్ ఉత్పత్తి దిగ్గజం NTPC లిమిటెడ్ ఏకీకృత నికర లాభం 6% తగ్గి రూ. 4,871 కోట్లకు చేరుకుంది. సమీక్ష కాల త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం 19% పెరిగి రూ. 44,253 కోట్లకు చేరుకుంది.


పవర్‌ గ్రిడ్‌: మార్చితో ముగిసిన త్రైమాసికంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏకీకృత నికర లాభం సంవత్సరానికి దాదాపు 4% వృద్ధితో రూ. 4,320 కోట్లకు పెరిగింది. ఈ త్రైమాసికంలో ఆదాయం దాదాపు 15% పెరిగి రూ. 12,264 కోట్లకు చేరుకుంది.


డెలివెరీ: లాజిస్టిక్స్ సంస్థ డెలివెరీ ఏకీకృత నికర నష్టం మార్చి త్రైమాసికంలో రూ. 159 కోట్లకు పెరిగింది. సమీక్ష కాల త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం 10% YoY తగ్గి రూ. 1,860 కోట్లకు చేరుకుంది.


JSW స్టీల్: జనవరి-మార్చి కాలంలో స్టీల్ దిగ్గజం ఏకీకృత నికర లాభం 13% వృద్ధితో రూ. 3,664 కోట్లకు చేరుకుంది. రిపోర్టింగ్ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రూ. 46,962 కోట్ల ఆదాయం వచ్చింది, YoY ప్రాతిపదికన ఫ్లాట్‌గా ఉంది.