Headlines Today : అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగు దివ్వెలు నింపిన మహనీయుడు డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి నేడు. భారత దేశ చరిత్రను మలుపు తిప్పిన అగ్రగణ్యుల్లో ఒకరు. భారత దేశ రాజ్యాంగ నిర్మాతగా, వెనుకబడిన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన శక్తిగా, స్వతంత్య్ర భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా సేవలు అందించారు. 'భారత రాజ్యాంగ పితామహుడు' అని పిలిచే డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ భారతదేశానికి చెందిన రాజకీయవేత్త, ఆర్థికవేత్త, న్యాయనిపుణుడు. ఏప్రిల్ 14, 1891 న జన్మించిన మహా శక్తి. రాజ్యాంగ సభ చర్చల సమయంలో భారత రాజ్యాంగాన్ని రూపొందించిన కమిటీకి నాయకత్వం వహించారు. మహిళల, కార్మిక హక్కులకు బలమైన మద్దతుదారు. అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న సామాజిక హక్కుల న్యాయవాది అంబేడ్కర్‌ జయంతి జరుపుకుంటారు.


అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహావిష్కరణ నేడు


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహావిష్కరణ నేడు ఘనంగా జరగనుంది. దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌ తీరంలో తెలంగాణ సర్కార్‌ నిర్మించింది. ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారు. విగ్రహావిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా రాజధాని నగరంలో విగ్రహావిష్కరణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలంటూ హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్న అఖిల భారత సర్వీస్‌ అధికారులందరినీ తెలంగాణ సర్కార్‌ ఆదేశించింది.  దేశంలోనే ఎత్తయిన అంబేద్కర్‌ విగ్రహం నిర్మాణం పూర్తయ్యింది. భారతావనికే తలమానికంగా నిలిచే ఈ నిర్మాణానికి ప్రత్యేకత సంతరించుకుంది. 


మంచిర్యాలలో కాంగ్రెస్ సభ


తెలంగాణలో నేతలు పార్టీని విడిచిపెట్టి పోతున్నా కాంగ్రెస్‌ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. మరింత పట్టుదలతో ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తోంది. మొన్నటి వరకు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పాదయాత్రతో ప్రజలను మెప్పించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క అదే పనిలో ఉన్నారు. పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేస్తూ కేడర్‌లో జోష్ నింపేందుకు ట్రై చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆయన చేస్తున్న పాదయాత్రకు మద్దతుగా మంచిర్యాల జిల్లాలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది కాంగ్రెస్. దీని కోసం భారీగా జనసమీకరణ చేస్తున్నారు పార్టీ నాయకులు. ఈ సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతోపాటు ఢిల్లీ అగ్రనాయకులు, రాష్ట్రంలోని నాయకులు రానున్నారు.


మార్చి 16న బోథ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామం నుంచి భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభించారు. మరో రెండు రోజుల్లో 30 రోజులు పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు బోథ్‌, ఖానాపూర్‌, అసిఫాబాద్‌, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజక వర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. 90 రోజుల పాదయాత్రలో మూడు చోట్ల బహిరంగ సభలకు ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మొదటి మంచిర్యాలలో కాగా... రెండోది రంగారెడ్డి జిల్లాలో మూడోది ముగింపు రోజున ఖమ్మంలో నిర్వహిస్తారు. 


నేటి నుంచి జూన్ వరకు వేట నిషేధం


నేటి నుంచి సముద్రంలో చేపల వేట నిషేధించింది ప్రభుత్వం. చేపలు పొదిగే కాలంలో ప్రతి ఏటా ఏప్రిల్ మూడో వారం నుంచి జూన్ రెండో వారం వరకు వేటను నిషేదిస్తుంటారు. ఈ సారి ఇవాల్టి(ఏప్రిల్‌ 14) అర్ధరాత్రి నుంచి జూన్‌ 15వ తేదీ వరకు సముద్రంలో పడవులు, బోట్లను అనుమతించరు. చేపల వేటకు వెళ్తే కఠిన చర్యలు ఉంటాయని మత్స్య శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో కోస్తా ప్రాంతంలో పడవలను వలలను తీరానికి చేర్చారు మత్స్యకారులు. ఏప్రిల్‌, మే, జూన్‌లో చేపలు, తాబేళ్లు, రొయ్యలు గుడ్లు పెట్టి పొదిగే కాలంగా భావిస్తారు. ఈ టైంలో వేట సాగిస్తే ఈ జాతుల వృద్ధికి ఆటకం ఏర్పడుతుందని వేటను నిషేధిస్తారు.